Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.45వేల కోట్ల ఎఫ్‌పీఐల ఉపసంహరణ
- భారత మార్కెట్ల నుంచి తరలింపు
ముంబయి : భారత స్టాక్ మార్కెట్లపై విదేశీ ఇన్వెస్టర్లు అనాసక్తి కనబర్చుతున్నారు. ఇది వరకు ఎప్పుడూలేని స్థాయిలో ప్రస్తుత ఏడాది మేలో విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌పీఐ) నికరంగా రూ.45,276 కోట్ల ఈక్విటీలను ఉపసంహరించుకున్నారు. 2020 మార్చి తర్వాత ఒక్క మాసంలో ఈ స్థాయిలో నిధులు తరలించుకుపోవడం ఇదే తొలిసారి. దేశ ఆర్థిక వ్యవస్థలో పెద్ద సానుకూల అంశాలు ఏవీ కానరాకపోవడం మదుపర్ల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడం, దేశీయంగా ద్రవ్యోల్బణం పెరుగుదల ఫలితంగా ఆర్ధిక మందగమన భయాలు ప్రధానంగా విదేశీ మదుపర్ల అమ్మకాలకు కారణాలుగా నిలిచాయని అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక సేవలు, ఐటీ కంపెనీలపై విదేశీ మదుపర్ల అమ్మకాల ప్రభావం ఎక్కువగా ఉంది. వరుసగా ఎనిమిదో మాసంలోనూ ఎఫ్ఐఐలు తరలిపోయాయి. ఇంత దీర్ఘకాలంగా రికార్డ్ స్థాయిలో నిధులు ఉపసంహరణ చోటు చేసుకోవడం ఇదే తొలిసారి. కోవిడ్ లాక్డౌన్ చర్యల కారణంగా 2020 మార్చిలో గరిష్టంగా రూ.62వేల కోట్ల ఎఫ్ఐఐలు తరలిపోయాయి. ఇప్పటి వరకు ఇదే ఒకనెల గరిష్ఠ అమ్మకాలుగా కొనసాగుతోంది. ఆ తర్వాత మళ్లీ గత నెలలోనే అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే బిఎస్ఇ సెన్సెక్స్, నిఫ్టీలు 3 శాతానికి పైగా నష్టపోయాయి. మే 2012 తర్వాత సూచీలు ఇంత పేలవ ప్రదర్శనను కనబరచడం ఇదే తొలిసారి.
సెన్సెక్స్ 185 పాయింట్ల పతనం
వరుసగా రెండో రోజూ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు చవి చూశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 185 పాయింట్లు లేదా 0.33 శాతం కోల్పోయి 55,381కి తగ్గింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 61 పాయింట్లు తగ్గి 16,523 వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.1 శాతం తగ్గగా.. స్మాల్ క్యాప్ సూచీ 0.62 శాతం పెరిగింది. నిఫ్టీలో ఐటి సూచీ అధికంగా 1 శాతం పతనమైంది. పీఎస్‌యూ బ్యాంకింగ్ సూచీ 0.9 శాతం తగ్గింది.