Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాకేశ్ తికాయత్‌పై దాడికి వ్యతిరేకంగా నిరసనలు
- బీజేపీ స్పాన్సర్ చేసిన దాడి: ఎస్కేఎం
న్యూఢిల్లీ : సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నేత రాకేశ్ తికాయత్‌పై బెంగుళూరులో జరిగిన దాడికి వ్యతిరేకంగా రైతు సంఘాలు నిరసనలు చేపట్టాయి. దోషులను శిక్షించాలని, నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఆయనపై జరిగిన దాడిని ఖండించారు. రాకేశ్‌కు భద్రత కల్పించాలని, ఈ ఘటనపై న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. రాకేశ్ తికాయత్‌పై జరిగిన దాడికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రైతు సంఘాలు ఒక్కతాటిపైకి వచ్చాయి. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని, విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ పలు రాష్ట్రాల్లో ప్రదర్శనలు జరిగాయి. బెంగళూరులో కర్నాటక రాజ్య రైతు సంఘం నేతలపై దుష్ప్రచారానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాకేశ్ తికాయత్ పై దాడి చేసి, ఆయనపై సిరా రంగు విసిరారు. దాడికి పాల్పడిన వారు 'జై మోడీ', 'మోడీ మోడీ' అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు భరత్ శెట్టి పోలీసుల కస్టడీలో ఉన్నాడు. కర్నాటక మాజీ సీఎం యడియూరప్పతో సహా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయేంద్ర, ప్రస్తుత హౌం మంత్రి అరగ జ్ఞానేంద్ర, నీటిపారుదల శాఖ మంత్రి గోవింద్ కార్జోల్లతో పాటు పలువురు బీజేపీ నేతలతో ప్రధాన నిందితుడు భరత్ శెట్టి ఉన్న ఫోటో ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈ ఫోటోలు బట్టీ బీజేపీ స్పాన్సర్ చేసిన దాడి అని స్పష్టం అవుతుందని రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు.
''గతంలో కూడా రాకేశ్ తికాయత్‌పై దాడిని చిన్న సంఘటనగా విస్మరించడం సరికాదు. గత కొద్ది రోజులుగా రైతు ఉద్యమానికి వ్యతిరేకంగా ఓ టీవీ చానెల్ ప్రచారం చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉన్నా బీజేపీ ప్రభుత్వం ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయలేదనేది కూడా స్పష్టమవుతోంది. సిరాను యాసిడ్, బాంబుతో భర్తీ చేసి ఉండవచ్చు. దాని పరిణామాలు ప్రాణాంతకం కావచ్చు. దాడికి పాల్పడిన వారికి బీజేపీ, కర్నా టక ప్రభుత్వం పూర్తి మద్దతు ఉందని ఇప్పుడు స్పష్టమైంది. ఈ ఘటన బీజేపీ రైతు వ్యతిరేకతను మరోసారి బట్టబయలు చేసింది. రైతులను పదే పదే మోసం చేస్తూ, వారిపై దాడులకు పూనుకున్న ఈ ప్రభుత్వానికి శాంతియుత, ప్రజాస్వామిక మార్గాలతో గుణపాఠం చెప్పడం రైతులకు తెలుసు'' అని ఎస్కేఎం నేతలు పేర్కొన్నారు.
ఢిల్లీ, కర్నా టక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హర్యానాతో పాటు ఇతర రాష్ట్రాల్లో నిరసనలు జరిగాయి. కర్నా టకలోని బెంగళూరు, చిక్‌బళ్లాపుర, చామరాజనగర్, సాగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో రైతు సంఘాలు నిరసనలు చేపట్టాయి. దోషులను కఠినంగా శిక్షించాలని, నిర్లక్ష్యానికి కారణమైన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని, ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని, దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని, రాకేశ్ తికాయత్‌కు భద్రత కల్పించాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది.
లఖింపూర్ కేసు ప్రత్యక్ష సాక్షి పై దాడి
లఖింపూర్ కేసులో ప్రత్యక్ష సాక్షి, భారతీయ కిసాన్ యూనియన్ నేతపై దాడి జరిగింది.. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. లఖింపూర్ జిల్లాలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. బీకేయూ జిల్లా అధ్యక్షుడైన దిల్బాగ్ సింగ్ మంగళవారం రాత్రి అలిగంజ్-ముండా రోడ్డులో వెళ్తుండగా గోలా కొత్వాలి సమీపంలో ఆయన ఎస్యువి కారును పంక్చర్ చేశారు. దీంతో ఆయన మధ్యలోనే ఆగాల్సి వచ్చి ంది. ఆ సమయంలోనే కాల్పులు జరపడంతో ఆయనకు గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. కాగా, గతేడాది అక్టోబర్ 3న కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్న లఖింపూర్ ఖేరి దారుణంలో ప్రత్యక్ష సాక్షుల్లో దిల్బాగ్ సింగ్ ఒకరుగా ఉన్నారు.