Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : హత్యలకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన కాశ్మీరీ పండిట్లను బంధించడమేనా న్యాయమంటే అని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మోడీ సర్కార్‌ని ప్రశ్నించారు. కాశ్మీర్ పండిట్ల డిమాండ్ ఒక్కటే.. భద్రత. రాహుల్ భట్, రజిని బాలా, మఖన్‌లాల్ బింద్రూ సహా ఇప్పటివరకు 16 మంది కాశ్మీరీ పండిట్లను ఉగ్రవాదులు హత్యచేశారు. కానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అయితే తమ భద్రత కోసం ఆందోళన చేపడుతున్న కాశ్మీరీ పండిట్లను లాక్కెళ్లి ప్రభుత్వం వారి కాలనీల్లోనే బంధీలుగా మార్చిందనీ, ఇదేనా న్యాయమంటే అని ప్రశ్నించారు. 1990లలో కాశ్మీరీ పండిట్లపై ఎలా జరిగిందో.. ప్రస్తుతం లోయలో అదే జరుగుతోందనీ, వారి ఇండ్లు, కార్యాలయాలు లక్ష్యంగా చేసుకుని హత్యలు చేస్తున్నారనీ, ఇది మానవత్వానికి విరుద్ధమని అన్నారు. ఈ హత్యలను ఆపేందుకు మోడీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో పాఠశాల ఆవరణలో ఒక ఉపాధ్యాయురాలిని మంగళవారం కొందరు దుండగులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. దీంతో ఆగ్రహించిన కాశ్మీరీ పండిట్లు లోయలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. గురువారం సాయంత్రంలోగా ప్రభుత్వం భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.