Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లిస్టింగ్ తర్వాత 13.42శాతం పడిపోయినషేర్ ధర
- మిగతా పీఎస్యూలదీ అదే పరిస్థితి : మార్కెట్ నిపుణులు
న్యూఢిల్లీ : జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ప్రయివేటీకరణ..ఆ సంస్థకుగానీ, ఆ సంస్థ షేర్లు కొనుకున్నవారికిగానీ లాభాల్ని తెచ్చిపెట్టలేదు. ఐపీవో (ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్) ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.20,560కోట్లు తన ఖజానాలో వేసుకుంది. ఐపీవో అనంతరం స్టాక్మార్కెట్లో ఎల్ఐసీ షేర్లు లిస్ట్ అయ్యాక..షేర్ ధర క్రమంగా తగ్గుతోంది. ఐపీవో (ఒక్కో షేర్ అమ్మకం విలువ రూ.946)తో పోల్చుకుంటే..షేర్ ధర 13.42శాతం పడిపోయింది. దీంతో ఐపీవో ద్వారా షేర్లు కొనుగోలు చేసినవారు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వ వాటాల అమ్మకం తర్వాత అనేక ప్రభుత్వరంగ సంస్థల (పీఎస్‌యూ) షేర్లు నేడు స్టాక్ మార్కెట్లో గణనీయంగా పడిపోయాయని, ఎల్ఐసీ విషయంలోనూ అదే జరిగిందని మార్కెట్ నిపుణులు చెప్పారు. న్యూ ఇండియా అష్యూరెన్స్, కొచిన్ షిప్‌యార్డ్, పంజాబ్-సింధ్ బ్యాంక్, మాంగనీస్ ఓర్ ఇండియా, కోల్ ఇండియా...ఈ కంపెనీల స్టాక్స్ ఐపీవో తర్వాత 5 నుంచి 7 శాతం వరకు పడిపోయాయి.
కేంద్రంలో మోడీ సర్కార్ వచ్చాక ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ వేగవంతమైంది. ఎల్ఐసీ విషయాన్నే తీసుకుంటే, ఆ సంస్థకు ఉన్న పేరు, ప్రతిష్ట, నమ్మకం..వంటివి, ఆర్థిక విలువను పరిగణలోకి తీసుకొని దానికి కేంద్రం వెలగట్టింది. ఐపీవో జారీ ద్వారా నగదుగా మార్చుకుంది. ఇందుకోసం మోడీ సర్కార్ అపరిమితమైన అధికారాల్ని ఉపయోగించింది. ఫలితం..నేడు ఆ సంస్థ పనితీరుపై స్టాక్‌మార్కెట్ ప్రభావం చూపనున్నది. సాధారణ ఇన్వెస్టర్లకు లాభాలు రాకపోగా, నష్టాలు వచ్చాయి. ఇలాంటి అనుభవం కేవలం ఎల్ఐసీ ఐపీవో విషయంలోనే కాదు, పలు ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణలో ఇప్పటికే ఉందని మార్కెట్ వర్గాలు చెప్పాయి.
న్యూస్ వెబ్‌పోర్టల్ 'ద ప్రింట్' వెలువరించిన ఒక వార్తా కథనం ప్రకారం, 2010 తర్వాత 22 ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ జరిగింది. వీటిలో ప్రభుత్వ వాటాల్ని అమ్మి కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.77వేల కోట్లు తన ఖజనాలో వేసుకుంది. ఇందులో ఎల్ఐసీ ద్వారా సేకరించిన మొత్తం రూ.20,560కోట్లు. ఇర్కాన్ ఇంటర్నేషనల్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, కోల్ ఇండియా, హడ్కో, ఎన్బీసీసీ..తదితర ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ తర్వాత, వాటి షేర్లు స్టాక్మార్కెట్లో దారుణంగా పడిపోయాయి. ఇన్వెస్టర్లు భారీ నష్టాల్ని చవిచూశారు. సంస్థ పనితీరుపైనా ఇది తీవ్ర ప్రభావం చూపింది. ఉదాహరణకు ఇర్కాన్ ఇంటర్నేషనల్‌లో ప్రభుత్వ వాటాను అమ్మటం ద్వారా రూ.500కోట్లు సేకరించాలని కేంద్రం (సెప్టెంబర్, 2018) లక్ష్యంగా పెట్టుకుంది. ఐపీవో జారీ ద్వారా ప్రతి షేర్‌ను రూ.475 వద్ద అమ్మకానికి పెట్టింది. అనుకున్నమేరకు నిధులు సమకూర్చుకుంది. అటు తర్వాత ఆ షేర్ విలువ మార్కెట్ ఒడిదొడుకులకు లోనై 90శాతానికిపైగా పడిపోయింది. ప్రస్తుతం రూ.39.34వద్ద నమోదవుతోంది. జనరల్ ఇన్సూరెన్స్‌ను ప్రయివేటీకరించి, కేంద్రం 2017లో దాదాపు రూ.11వేల కోట్లు సేకరించింది. ఈ కంపెనీ షేర్ విలువ ఇప్పుడు 77శాతం పడిపోయింది. ఇన్వెస్టర్లు భారీమొత్తంలో నష్టపోయారు. నిఫ్టీ సూచికలో పీఎస్‌యూ కంపెనీల షేర్లు 60శాతం వృద్ధి చెందినా, జనరల్ ఇన్సూరెన్స్ స్టాక్ 74శాతం పడిపోవటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.