Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్కెట్ ధర చెల్లించాల్సిందే
- గ్యాస్‌పై సబ్సిడీకి మంగళం పాడేసిన మోడీ సర్కారు
- ఉజ్వల లబ్ది దారులకే రూ.200 సబ్సిడీ
న్యూఢిల్లీ : గృహ వినియోగదారుల నెత్తిన పెద్ద బండ పడింది. ఎల్పీజీ సబ్సిడీని మొత్తంగా ఎత్తివేస్తున్నట్లు కేంద్రంలోని మోడీ సర్కారు గురువారం ప్రకటించింది. కేవలం ఉజ్వల లబ్ది దారులకు మాత్రమే ఇకపై పరిమిత సబ్సిడీ లభిస్తుందని పేర్కొంది. మిగిలిన వారందరూ తమ సిలిండర్‌కు మార్కెట్ ధర చెల్లించాల్సిందే. ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్లు పొందిన తొమ్మిది కోట్ల మంది మహిళలు, ఇతర లబ్ధిదారులకు మాత్రమే ఇకపై ఈ సబ్సిడీ అందనుంది. చమురు కార్యదర్శి పంకజ్ జైన్ గురువారం ఈ విషయం ప్రకటిం చారు. కోవిడ్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఎల్పీజీ వినియోగదారులకు సబ్సిడీ ఇవ్వడం లేదని, ఇకపై ఉజ్వల లబ్ధిదారులకే ప్రస్తుతమిస్తున్న సబ్సిడీ కొనసాగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా 30.5 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు వుండగా, అందులో తొమ్మిది కోట్ల వరకు ఉజ్వల లబ్ధిదారులు వున్నారు. అంటే మిగిలిన 21కోట్ల మందికీ సబ్సిడీ లేకుండా పోయింది.
2020 నుంచి సబ్సిడీ ఇవ్వడం లేదు : పంకజ్‌జైన్
2020 జూన్ నుండి వంట గ్యాస్‌పై సబ్సిడీని కేంద్రం చెల్లించడం లేదని, మార్చి 21న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సబ్సిడీ మాత్రమే అందజేయబడుతోందని మీడియా సమావేశంలో పంకజ్ జైన్ పేర్కొన్నారు. పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉజ్వల లబ్ధిదారులకు సిలిండరుకు రూ.200 చొప్పున సబ్సిడీ లభిస్తుందని ప్రకటించారు. అది కూడా ఏడాదిలో 12 సిలిండర్లకే వర్తిస్తుందని చెప్పారు. రికార్డు స్థాయిలో వంట గ్యాస్ రేట్లు పెరగడం వల్ల తలెత్తిన భారం కొంతైనా తగ్గడానికి ఇది ఉపకరిస్తుందని చెప్పారు. అదే పత్రికా సమావేశంలో చమురు మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, 'సబ్సిడీల నిర్వచనం ప్రకారం, అవి పెరుగుతూ పోవడానికి, స్థిరపడేందుకు ఉద్దేశించబడలేదు. సబ్సిడీలనేవి ఎప్పుడూ తగ్గుముఖం పడుతూనే వుండాలి' అని వ్యాఖ్యానించారు. ఎల్పీజీ సిలిండర్ ధర దేశమంతటా వెయ్యి రూపాయల పైనే ఉంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద లబ్ది దారులు పొందే రూ.200 సబ్సిడీ నేరుగా వారి బ్యాంక్‌ఖాతాలో పడుతుంది. మిగిలిన వారందరూ మార్కెట్ రేటును చెల్లించాల్సిందే. 2019లో పెట్రోలుపై సబ్సిడీని అప్పటి యూపీఏ ప్రభుత్వం ఎత్తివేయగా, 2014 నవంబరులో డీజిల్‌పై సబ్సిడీని మోడీ ప్రభుత్వం ఎత్తివేసింది. 2016లో మోడీ సర్కారు కిరోసిన్‌పై ఇస్తున్న సబ్సిడీని నిలిపివేయగా, తాజాగా గ్యాస్‌పై సబ్సిడీకి మంగళం పాడింది.