Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళను జాబ్ మార్కెట్ నుంచి దూరం చేసిన మహమ్మారి
- ప్రస్తుతం శ్రామిక శక్తిలో లేని 90 శాతం మంది మహిళలు
- ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం
- పట్టించుకోని మోడీ సర్కారు : ఆర్థిక నిపుణుల హెచ్చరిక
న్యూఢిల్లీ : భారత్తో పాటు ప్రపంచ దేశాలపై కోవిడ్-19 మహమ్మారి అనేక విధాలుగా, అనేక అంశాల్లో ప్రతికూల ప్రభావం చూపింది. మహమ్మారి ప్రభావం కారణంగా దేశాల ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. భారత్ కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొన్నది. ఇది ముఖ్యంగా మహిళలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. వారిని జాబ్ మార్కెట్ నుంచి దూరం చేసింది. మహమ్మారి తెచ్చిన పరిస్థితుల కారణంగా దాదాపు 90 శాతం మంది మహిళలు ప్రస్తుతం శ్రామిక శక్తిలో లేరని తెలిసింది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మాత్రం ఈ పరిస్థితిని అంత తీవ్రంగా పరిగణించటం లేదని ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, దీనిని సీరియస్గా తీసుకోకపోతే కష్టమేనని మోడీ ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. మహిళలను తిరిగి ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను చేయాలనీ, వారికి ఉద్యోగ, ఉపాధులను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలా కాకపోతే, దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పారు.
కోవిడ్-19 మహమ్మారికి ముందు ఆశించనంత కాకపోయినా.. ఎంతో కొంత స్థాయిలో మహిళలు ఆర్థిక వ్యవస్థలో తమ వంతు పాత్రను పోషించారు. అయితే, మహమ్మారి ప్రవేశంతో దేశంలో మహిళలకు ఆర్థిక స్వేచ్ఛతో కూడిన జీవితానికి హఠాత్తుగా ఫుల్స్టాప్ పడింది. మోడీ ప్రభుత్వ అనాలోచిత లాక్డౌన్ నిర్ణయం మహిళలకు పెద్ద శాపంగా మారింది. లాక్డౌన్ కారణంగా దేశంలో అన్ని వ్యాపార, వాణిజ్య మార్కెట్లు మూతబడ్డాయి. కొన్ని వారాల్లోనే, కోట్ల మందికి పైగా భారతీయులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇందులో మహిళల సంఖ్య అధికంగా ఉన్నదని నిపుణులు చెప్పారు. మహమ్మారి పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాయి. పురుషులు ఉద్యోగ, ఉపాధిని సంపాదించి జాబ్ మార్కెట్లో తమ ఉనికిని తెలియజేస్తున్నారు. అయితే, మహిళల పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నది. ఇప్పటికీ 90 శాతం మంది మహిళలు శ్రామిక శక్తికి దూరంగా ఉన్నారని ఆర్థిక నిపుణులు తెలిపారు. మహిళలకు ఉద్యోగాలను పునరుద్ధరించటంలో విఫలమైతే.. ప్రపంచ ఆర్థిక వృద్ధి ట్రిలియన్ డాలర్ల మేర తగ్గుతుందని హెచ్చరించారు. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ సూచన ముఖ్యంగా అస్పష్టంగా ఉన్నది. ఇక్కడ మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం చాలా బాగా పడిపోయింది.
ప్రపంచంలోనే రెండో అత్యధిక జనాభాను కలిగి ఉన్న దేశమైన భారత్.. ఈ విషయంలో ఆందోళనకర పరిస్థితులను ఎదుర్కొంటున్నది. 2010-2020 మధ్య ప్రపంచ బ్యాంక్ సంకలనం చేసిన నివేదిక ప్రకారం.. భారత్లో పని చేసే మహిళల సంఖ్య 26 శాతం నుంచి 19 శాతానికి పడిపోయింది. 2022 నాటికి మహిళా ఉపాధి తొమ్మిది శాతానికి పడిపోయిందని దేశ వాణిజ్య రాజధాని ముంబయిలోని ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మారికి ముందే దేశ ఆర్థిక వ్యవస్థ మందగించిందనీ.. కరోనా ప్రవేశంతో మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో దేశ ఆర్థిక పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైందని ఆర్థిక నిపుణులు తెలిపారు. ఈ విషయంలో ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధను కనబర్చి మహిళలను జాబ్ మార్కెట్లోకి తీసుకురావాలని సూచించారు. ఇందుకు ప్రత్యేక పథకాలతో ముందుకు రావాలని సూచించారు. లేకపోతే, దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు వాటిల్లటమే కాకుండా.. మహిళలు తమ ఆర్థిక స్వేచ్ఛను కోల్పోయే ప్రమాదమున్నదని తెలిపారు.