Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హఠాత్తుగా ప్రధాని మోడీతో ఏపీ సీఎం జగన్ భేటీ.?
- ఒకటి రెండు మినహా అన్ని పాత డిమాండ్లే
- వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశానికి ప్రస్తావించని ముఖ్యమంత్రి
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార బీజేపీ, బీజేపీయేతర పార్టీలతో చర్చలు ముమ్మరం చేసింది. అందుకు అంది వచ్చిన ప్రతి అంశాన్ని ప్రయోగిస్తుంది. గురువారం ప్రధాని మోడీతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ కూడా రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగానే జరిగినట్టు సమాచారం. ప్రధాని మోడీ ఎన్డీయేలో లేని బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్య మంత్రులతో భేటీ అవుతున్నారు. ఆయనే పిలుపిం చుకొని రాష్ట్రపతి ఎన్నికలపై ఆయా ముఖ్య మంత్రులతో చర్చిస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను ఢిల్లీకి పిలుపించుకొని రాష్ట్రపతి ఎన్నికలపై చర్చించినట్టు సమాచారం. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పిలిపించుకొని చర్చలు జరిపారు. గతంలో అనేక సార్లు ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూపులు చూసిన సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రధాని మోడీ పిలుపించుకో వడంలో రాజకీయమే దాగి ఉంది. దావోస్ నుంచి వచ్చిన వెంటనే హఠాత్తుగా ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ జరిగింది. ఈ భేటీ రాష్ట్రపతి ఎన్నికలే ప్రధానాంశంగా జరిగినట్టు సమాచారం.
ఒకటి రెండు మినహా అన్ని పాత డిమాండ్లే
ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీలో రాష్ట్ర అంశాలు ప్రస్తావనకు వచ్చాయని ప్రభుత్వం తరపున ప్రకటన విడుదల చేశారు. అందులో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలు పేర్కొన్నారు. మొత్తం తొమ్మిది డిమాండ్లు చేయగా, అందులో ఒకటి రెండు డిమాండ్లు తప్ప మిగిలిన డిమాండ్లన్ని పాతవే. ఈ భేటీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీ కరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే అంశాన్ని సీఎం జగన్ కనీసం ప్రస్తావించలేదు. అలాగే వెనుక బడిన జిల్లాల నిధులు గురించి కూడా డిమాండ్ చేయలేదు.
రుణ పరిమితిని సడలించండి
రాష్ట్రానికి రావాల్సిన రూ.32,625 కోట్ల రెవిన్యూ లోటును భర్తీ చేయాలని రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం ప్రధాని మోడీతో సిఎం జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాలకుపైగా జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రధాని మోడీ వివరించారు. ఈ సం దర్భంగా రెవెన్యూ లోటు భర్తీ, పోలవరం ప్రాజెక్టు, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో తారతమ్యాల సవరణ, ఏపీఎండీసీకి గనులు కేటాయింపు, మెడికల్ కాలేజీలు తదితర అంశాలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు.
''2014-15కు సంబంధించిన పెండింగ్ బిల్లులు, పదో వేతన సంఘం బకాయిలు, డిస్కంల ఆర్థిక పునర్వ్యవస్థీకరణ ప్యాకేజీ,వృద్ధులకు పెన్షన్లు, రైతుల రుణమాఫీకి సంబంధించి రూ.32,625 కోట్లు రెవెన్యూ గ్యాప్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సి ఉంది. ఈ అంశంపై వెంటనే దృష్టి సారించి నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలి'' అని కోరారు. ''తెలంగాణ ప్రభుత్వం రూ.6,627.86 కోట్లు విద్యుత్ బకాయిలను చెల్లించాల్సి ఉంది. రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ, ఉత్పాదక సంస్థలు ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడు తున్నాయి. ఈ వ్యవహారాన్ని వెంటనే సెటిల్ చేయండి'' అని విజ్ఞప్తి చేశారు.
''2016-17 నుంచి 2018-19 వరకూ అప్పటి ప్రభుత్వ నిర్దేశించిన పరిమితికి మించి చేసిన అప్పులను పరిగణనలోకి తీసుకుని, ఇప్పుడు రుణ పరిమితిలో కోత విధిస్తున్నారు. గడచిన మూడేండ్లలో రూ.17,923 కోట్ల మేర రుణ పరిమితిలో కోత విధించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటన్నవి రుణాలే కాని, గ్రాంట్లు కావు. కోవిడ్ లాంటి విపత్తుల దృష్ట్యా ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలి'' అని కోరారు.
పోలవరం అంచనాలను రూ.55,548.87 కోట్లకు ఖరారు చేయండి
''సవరించిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు అంచనాలను రూ.55,548.87 కోట్లకు ఖరారు చేయండి. ఇప్పటికే సాంకేతిక సలహా మండలి దీనికి ఆమోదం తెలిపింది'' అని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డ్రింకింగ్ వాటర్ కాంపొనెంట్‌ను ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్భాగంగా చూడాలని కోరారు. గతంలో జాతీయ హౌదా ప్రాజెక్టుల విషయలో అనుసరించిన విధానాన్నే ఇక్కడ కూడా అనుసరించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని కాంపొనెంట్‌వారీగా విడివిడిగా కాకుండా... మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని పరిగణలోకి తీసుకుని రీయింబర్స్ చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఖర్చు చేసిన రూ.905.51 కోట్లను 15 రోజుల్లో చెల్లించాలని కోరారు.
నిర్వాసిత కుటుంబాలకు ఇవ్వాల్సిన ప్యాకేజీని డీబీటీ పద్ధతిలో చేయాలని, దీనివల్ల చాలా వరకు జాప్యాన్ని నివారించవచ్చని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా, సజావుగా సాగడానికి వీలుగా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే మొదటి స్పెల్‌లో నిధులు అడ్వాన్స్‌గా ఇవ్వాలని, వీటికి సంబంధించి 80 శాతం పనులు పూర్తి అయిన తరువాత రెండో స్పెల్‌లో మిగిలిన నిధులు ఇవ్వాలని కోరారు.
రేషన్ లబ్ది దారుల ఎంపికలో ఉన్న అసమానతలను తొలగించాలి
జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రేషన్ కార్డు లబ్ది దారుల ఎంపికలో ఉన్న అసమానతలను తొలగించాలని కోరారు. కేంద్ర, రాష్ట్రానికి చెందిన సంబంధిత శాఖల అధికారులతో నీతి ఆయోగ్ సమావేశమై, ఆహార భద్రతా చట్టం కింద రాష్ట్రానికి ఇస్తున్న బియ్యం తక్కువగా ఇస్తున్నట్టు గుర్తించిందని, దీన్ని వెంటనే పున్ణసమీక్షించాలని చెప్పిందని సీఎం జగన్ ప్రస్తావించారు. దేశంలో నెలకు 3 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వ ఉందని, ఇందులో రాష్ట్రానికి కేటాయింపులు చేస్తే సరిపోతుందంటూ నిటి ఆయోగ్ సిఫారసు చేసిందని తెలిపారు. నెలకు 0.77లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అదనంగా రాష్ట్రానికి ఇవ్వాలంటూ నిటి ఆయోగ్ సిఫారసు ను ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద కూడా తక్కువ కేటాయింపులు ఉన్నాయని అన్నారు. దాదాపు 56 లక్షల కుటుంబాలు కవర్ కావడం లేదని, వీరికిచ్చే బియ్యం సబ్సిడీ భారాన్ని రాష్ట్రం భరిస్తోందని ప్రధానిదృష్టికి తీసుకెళ్లారు.
12 మెడికల్ కాలేజీలకు అనుమతులు మంజూరు చేయాలి
''రాష్ట్రంలో ఇప్పటివరకూ 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. కొత్తగా మరో 3 మెడికల్ కాలేజీలకే కేంద్రం అనుమతి ఇచ్చింది. వీటి పనులు చురుగ్గా సాగుతున్నాయి. మొత్తంగా 26 జిల్లాలకు 14 మెడికల్ కాలేజీలు ఉన్నట్టు అవుతుంది. రాష్ట్రంలో అత్యాధునిక వైద్య సదుపా యాలు అందరికీ అందుబాటులో ఉండాలంటే.. మెడికల్ కాలేజీలు చాలా అవసరం. మిగిలిన 12 కాలేజీలకు అనుమతులు మంజూరు చేయాలి'' అని కోరారు. భోగాపురం ఎయిర్‌పోర్టు అనుమతులు ఇవ్వాలని కోరారు.ఏపీఎండీసీకి ఇనుప గనులు కేటాయించాలని జగన్ విన్నవించారు.