Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉప ముఖ్యమంత్రినీ ఇరికించాలని చూస్తున్నారు
- కేంద్ర సర్కార్‌పై ఢిల్లీ సీఎం విమర్శలు
న్యూఢిల్లీ : తన ప్రభుత్వంలో మరో మంత్రి అరెస్టు కానున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఇరికించాలని చూస్తున్నారనీ, సత్యేంద్ర జైన్ తర్వాత ఆయనే అరెస్టు కానున్నారని తెలిపారు. 'మమ్మల్నందర్ని కలిపి జైలులో తోసేయండి' అని ప్రధాని మోడీకి కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. అవినీతి ఆరోపణల కింద మనీష్ సిసోడియాను అరెస్టు చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తనకు సమాచారం అందిందన్నారు. సిసోడియాను త్వరలో అరెస్టు చేయబోతున్నట్టు, ఆయనపై తప్పుడు కేసులు బనాయించాలని అన్ని ఏజెన్సీలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసిందని పేర్కొన్నారు. 'మమ్మలందర్ని ఒకేసారి అరెస్టు చేయండి. మాపై దర్యాప్తులు, దాడులు చేపట్టారు. తిరిగి మేం మా పని చేసుకుంటూ వెళ్లాం. ఎందుకంటే మాకు రాజకీయాలు తెలియదు. మేం మా పనిని చేసుకోవాలనుకుంటున్నాం' అని వీడియో సందేశంలో పేర్కొన్నారు. 'మనీష్ సిసోడియా అవినీతిపరుడా అని విద్యారంగంలో ఆయన చేసిన కృషి వల్ల లబ్ది పొందిన 18 లక్షల మంది చిన్నారులను అడగాలనుకుంటున్నాను. ప్రపంచం దృష్టిలో భారత్‌కు పేరు ప్రఖ్యాతలు తెచ్చారు. అలాంటి వ్యక్తిని అరెస్టు చేయాలా.. లేదా రివార్డు ఇవ్వాలా? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. జైన్, సిసోడియాలను జైలుకు పంపడం వెనుక రాజకీయాలు తనకు తెలియదని అన్నారు. సత్యేంద్ర జైన్ ప్రజలు వ్యాక్సిన్లు పొందేందుకు మోహల్లా క్లినికల్స్ ఏర్పాటుచేయడంలో కీలక పాత్ర పోషించారనీ, కానీ వారిని ఇప్పుడు అవినీతిపరులను చేశారని తెలిపారు. 'తల్లిదండ్రులను, పిల్లలను అడగాలనుకుంటున్నా.. సత్యేంద్ర జైన్ అవినీతి పరుడా అని? ఒక వేళ వారు అవినీతిపరులైతే.. నిజాయితీ పరులెవరో చెప్పండి?' అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇద్దరు మంత్రులను ఇరికించి వారికున్న మంచి పేరును చెడగొట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, అలా జరగనివ్వనని అన్నారు. మొత్తం 20 మందికి పైగా ఆప్ ఎమ్మెల్యేలపై కేసులు నమోదయ్యాయనీ, జైలు గేమ్‌ను ప్రారంభించారని అన్నారు.