Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గర్భిణిల్లో అవగాహన తక్కువ
- వైద్య, ఆరోగ్య నిపుణుల హెచ్చరిక
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రజలు ఎండలకు అల్లాడు తున్నారు. ముఖ్యంగా, వేసవి కాలంలోని వేడి గాలుల ప్రభావం తీవ్రంగా కనిపిస్తున్నది. ఇవి తల్లి, శిశువు ఆరోగ్యానికి ముప్పును కలిగిస్తాయని వైద్య, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావం ముందస్తు డెలివరీలకు దారి తీయొచ్చని చెప్తున్నారు. అయితే, ప్రెగెన్సీ సమయంలో వేడి గాలులు తమపై చూపే ప్రభావం గురించి గర్భిణీల్లో అవగాహన తక్కువగా ఉన్నదని నిపుణులు చెప్పారు. ఈ విషయంలో మరిన్ని పరిశోధనలు అవసరమని వివరించారు.
ఇటీవలి వారాల్లో ప్రసూతి విభాగంలో చాలా మంది గర్భిణిలు వాంతులు, డీహైడ్రేషన్ వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని హైరిస్క్ ప్రెగెన్సీలపై దృష్టి సారించే ఆస్పత్రిలోని ప్రసూతి వైద్య నిపుణుడు డాక్టర్ అనా తెలిపారు. భారత్‌లో వేడిగాలులు సాధారమే అయినప్పటికీ.. ఈ ఏడాది అస్థిరమైన ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ముందు గానే వచ్చాయి. వేసవికి ముందే రికార్డు స్థాయికి చేరుకున్నాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకారం వాయువ్య, మధ్య భారతదేశం 122 ఏండ్లలో ఏప్రిల్‌లో అత్యంత వేడిగా ఉన్నది. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో వాతావరణ మార్పు తీవ్ర వేడిని పెంచటంతో తల్లి, నవజాత శిశువుల ఆరోగ్యంపై ప్రభావం వినాశకరమైనదని నిపుణు లు హెచ్చరించారు.
గ్లోబల్ వార్మింగ్‌తో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పిల్లలు ఆరోగ్యానికి పెద్ద చిక్కులను కలిగిస్తాయని దక్షిణాఫ్రికాలోని విట్స్ రిప్రొడక్టివ్ హెల్త్ అండ్ హెచ్ఐవీ ఇన్స్టిట్యూట్ (డబ్ల్యూఆర్హెచ్ఐ) స్పష్టం చేసింది. వేడి గాలుల ప్రభావం ముఖ్యంగా పేద మహిళలకు కలిగించే నష్టమ ఎక్కువ అని వివరించింది. భారత్‌లో తక్కువ సామాజిక-ఆర్థిక స్థితి ఉన్న మహిళలు ఎయిర్ కండిషనర్లు, కూలర్లు, ఫ్యాన్లు వంటివి కూడా కలిగి ఉండరు. విద్యుత్ సమస్య కూడా మరొక కారణం అని డాక్టర్ థరియాని చెప్పారు. భారత్‌లో 32.3 కోట్ల మందికి శీతలీకరణ (కూలింగ్) అందుబాటులో లేదని ఒక నివేదిక పేర్కొన్నది.
సఫ్దర్‌గంజ్ ఆస్పత్రిలో వేడి కారణంగా చాలా మంది మహిళలు తల్లిపాలు పట్టలేకపోయారని డాక్టర్ అనా చెప్పారు. ''స్త్రీకి హైడ్రేషన్ లేకపోతే.. ఆమె బిడ్డకు ఎలా ఆహారం ఇవ్వగలదు? ఆమె సరిగ్గా పాలు ఇవ్వదు'' అని తెలిపారు. భారత్ ఇప్పటికే అధికస్థాయి పిల్లల పోషకాహార లోపంతో పోరాడు తున్నది. ఐదేండ్లలోపు పిల్లల్లో మూడింట రెండు వంతుల మరణాలకు ఇది కారణమైంది. ఆరోగ్యంపై పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావాలు చాలా కాలంగా పరిశోధకులకు ఆందోళన కలిగిస్తున్నాయి. వేడిగాలులు ఆహారం, నీటి కొరతను పెంచుతా యనీ, అంటు వ్యాధుల వ్యాప్తిని సులభతరం చేస్తాయని వారు హెచ్చరించారు. ఈ విషయంపై గర్భిణిల్లో అవగాహన కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని వైద్య, ఆరోగ్య నిపుణులు తెలిపారు.