Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొగుట
సకాలంలో వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని, తూకం వేసిన ధాన్యం తరలించడానికి లారీలు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటలో రైతులు ధర్నా, రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు ప్రారంభించి నెల రోజులు కావస్తున్నా ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం నూర్పిడి చేసి ఆరబోసిన అనంతరం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చినా కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నారని ఆరోపించారు. రైస్‌మిల్లు యజమానులు దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి కేటాయించిన రైస్ మిల్లు యజమాని టార్గెట్ పూర్తయిందని, ధాన్యం తీసుకోలేమని అంటున్నాడని తెలిపారు. గతంలో ధాన్యం కొనుగోలు చేసినప్పుడు జల్లి పట్టకుండా 2 కేజీలు అధికంగా తీసుకున్నారని చెప్పారు. ఈసారి జల్లి పట్టిన ధాన్యం 2 కేజీలు, జల్లి పట్టకుండా ధాన్యం 6 కేజీలు అధికంగా ఇస్తేనే తీసుకుంటామని రైస్‌మిల్లు యజమాని ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. గణపూర్ వద్ద శారదాంబా పార్ బాయిల్డ్ మిల్లు యజమాని 45, 46 కేజీలు ఇస్తేనే తీసుకుంటామని తెగేసి చెబుతున్నారని వాపోయారు. సమాచారం అందుకున్న ఎస్ఐ కర్ణాకర్‌రెడ్డి అక్కడికి చేరుకొని ధాన్యం తరలించేందుకు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. అనంతరం ఐకేపీ ఏపీఎం మగ్దూంఅలీ లారీని ఏర్పాటు చేసి ధాన్యం తరలించారు.