Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు.. !
న్యూఢిల్లీ : దేశంలో మళ్లీ కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. క్రియాశీల కేసుల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తున్నది. కేరళ, మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నది. ప్రస్తుతం కోవిడ్ క్రియాశీల కేసులు 21 వేల మార్కు దాటాయి.
ఒక్కరోజులో 300 కేసులు పెరిగాయి..!
శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల మేరకు... గురువారం 4.25 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 4,041 మందికి కరోనా సోకినట్టు నిర్థారణ అయ్యింది. ముందురోజు 3,712గా ఉన్న కొత్త కేసులు 300 పైగా పెరిగాయి. 84 రోజుల తర్వాత అత్యధిక కోవిడ్ కేసులు ఇప్పుడు నమోదయ్యాయి.! కోవిడ్ పాజిటివిటీ రేటు ఒక శాతానికి చేరువైంది. కేరళలో 1,370, మహారాష్ట్రలో 1,045 మంది కోవిడ్ వైరస్ బారినపడ్డారు. ఆ రెండు రాష్ట్రాల్లోనే రెండు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.
ముంబయి ప్రజలకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరిక...
ముంబయిలో పాజిటివిటీ రేటు ప్రమాదకరస్థాయిలో ఉండటంతో ప్రజలంతా కోవిడ్ నియమావళిని పాటించాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కోరారు. మరోసారి ఆంక్షల చట్రంలోకి వెళ్లకూడదనుకుంటే.. ఎవరికివారు స్వచ్ఛందంగా నిబంధనలు పాటించాలని హెచ్చరించారు.
క్రియాశీల కేసుల్లో గణనీయంగా పెరుగుదల..
ప్రస్తుతం కోవిడ్ క్రియాశీల కేసుల్లో గణనీయమైన పెరుగుదల కనిపించింది. నిన్న (గురువారం) 19 వేలకు పైగా ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య.. ఒక్కసారిగా 21,177 (0.05 శాతం)కు ఎగబాకింది. 24 గంటల వ్యవధిలో 2,363 మంది కరోనా నుండి కోలుకున్నారు. 10 మంది కరోనాతో మరణించారు. మొత్తం కేసులు 4.31 కోట్లకు పైగా ఉండగా.. అందులో రికవరీల వాటా 98.74 శాతంగా కొనసాగుతోంది.
కొనసాగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్..
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోనే ఉంది. నిన్న (గురువారం) 12.05 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకోగా.. ఇప్పటివరకూ 193 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం పేర్కొంది.