Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు నెలలుగా.. కిలో టమాటా రూ.80
- హడలెత్తిస్తున్న..బెండ, చిక్కుడు, బీరకాయ ధరలు
- ఏదీ కొనలేని పరిస్థితిలో పేదలు, సామాన్యులు
- ఇది ద్రవ్యోల్బణం దెబ్బ : ఆర్థిక నిపుణులు
న్యూఢిల్లీ : ఒకటో తారీఖు వచ్చిందంటే జనాలు భయపడుతున్నారు. వస్తున్న ఆదాయానికి, రోజువారీ ఖర్చులకు పొంతనలేని పరిస్థితి వచ్చి పడింది. కిలో టమాటా రూ.80, బెండకాయ రూ.70, బీరకాయ రూ.90..కూరగాయల ధరలు మునుపెన్నడూ లేనంతగా పెరిగాయి. కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు, ఇంటి ఖర్చు లెక్క చూసుకున్న తర్వాత సగటు ఉద్యోగి కండ్లు బైర్లు కమ్ముతున్నాయి. కేంద్ర ప్రభుత్వ వర్గాలు వేసిన అంచనా కంటే ఎక్కువగా కూరగాయలు, ఆహార ఉత్పత్తుల ధరలు పెరిగాయని 'ధరల నియంత్రన కమిటీ' సభ్యుడు ఒకరు మీడియాకు వెల్లడించారు. ఒక నెల వ్యవధిలో కిలో టమాటా ధర 168 శాతం పెరిగిందని కేంద్ర ఆహార శాఖ విడుదల చేసిన గణాంకాలే చెబుతున్నాయి. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి ఆర్బీఐ ఇటీవల వడ్డీరేట్లను పెంచటం తెలిసిందే.
మనదేశంలో ధరల పెరుగుదల, మార్కెట్ దోపిడి..కోవిడ్ సంక్షోభంతో మొదలైంది. వంటనూనె, వంటగ్యాస్ ధరలు కొన్ని రోజులు వేధించాయి. అటు తర్వాత ఔషధాలు, నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు భరించరానంత పెరిగాయి. ఇప్పుడు కూరగాయల వంతు. టమాటా, ఆలూ, ఉల్లిగండ..ఈ మూడు ప్రతి కుటుంబం నిత్యం వంటకాల్లో వాడుతాయి. గత రెండు నెలలుగా వీటి ధరలు విపరీతంగా పెరగటంతో, పేదలు, మధ్య తరగతికి ఏంచేయాలో పాలుపోవటం లేదు.
ఈ ఏడాది ఆరంభంలో కిలో టమాటా రూ.30-40మధ్య ఉండేది. ఎప్పుడైతే పెట్రోల్, డీజిల్ ధరల పెంపు మొదలైందో..కూరగాయల ధరలూ పెరగటం ఆరంభమైంది. రూ.40 నుంచి 55కు, అటు తర్వాత ఒక్క నెలలో రూ.80కి చేరుకుంది. వంటనూనె, గోధుమ, బియ్యం, ఇతర నిత్యావసర సరుకుల ధరలూ భారీగా పెరిగాయి. ఆహార ద్రవ్యోల్బణం 8ఏండ్లలో రికార్డుస్థాయికి చేరుకుంది. ఇదంతా కూడా అనాలోచిత ఆర్థిక విధానాల ఫలితమని, అడ్డు అదుపు లేకుండా ఇంధన ధరల పెంపు ప్రభావం తప్ప మరోటి కాదని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.