Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్లో ఏటా 17లక్షల మంది మృతి
- పండ్లు, కూరగాయాలు, తృణధాన్యాలు కొనలేనివారు
- భారత్లో 71శాతం..
- మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులతో మరణాలు : పర్యావరణ నివేదిక
- 2012-13 నాటితో పోల్చితే 2018-19 నాటికి పంట సాగు వ్యయం 35శాతం పెరిగింది. మరోవైపు రైతు ఆదాయం 48శాతం పడిపోయింది.
- సగటున ప్రతి రైతు కుటుంబంపై రూ.74వేలకుపైగా అప్పు ఉంది. అప్పుల బాధ భరించలేక ప్రతిరోజూ రైతులు, రైతు కూలీలు 29మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.
- ఆహార ధరలు అనూహ్యంగా పెరిగాయి. వినియోగదారుల ఆహార ధరల సూచిక ప్రకారం గత ఏడాది కాలంలో ద్రవ్యోల్బణం 327శాతం పెరిగింది.
న్యూఢిల్లీ : దేశంలో తిండి గింజలు, కూరగాయలు, పండ్లు సమృద్ధిగా ఉన్నా..ప్రజలందరికీ సరైన ఆహారం మాత్రం అందుబాటులో లేదు. పండ్లు, కూరగాయలు, గింజధాన్యాలు, మాంసకృతులు, పప్పులు...మొదలైనవాటి ధరలు సగటు పౌరుడు కొనలేని స్థాయిలో ఉన్నాయి. దాంతో సమతుల ఆహారాన్ని పొందలేకపోతున్నాడని, అనారోగ్యంతో మరణానికి దగ్గరవుతున్నాడని 'పర్యావరణ-2022 నివేదిక' హెచ్చరించింది. ఈ పరిస్థితి వల్ల భారత్లో ప్రతిఏటా 17లక్షల మంది చనితున్నారని వెల్లడించింది. సమతుల ఆహారం కొనుగోలు చేయలేనివారు ప్రపంచంలో 42శాతం మంది ఉంటే, భారత్లో వారి సంఖ్య 71శాతంగా ఉందని నివేదిక తెలిపింది. సగటు భారతీయుడి రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, మొలకెత్తిన గింజలు, తృణధాన్యాలు ఉండటం లేదని హెచ్చరించింది. వివిధ అనారోగ్య సమస్యలకు ఇదే ప్రధాన కారణమని పేర్కొన్నది.
బలవర్ధకమైన ఆహారం తీసుకోక ఎంతోమంది ఆరోగ్య సమస్యల్లో చిక్కుకుంటున్నారని, శారీరక బరువులో అనేక మార్పులు వస్తున్నాయని నివేదిక పేర్కొన్నది. సెంటర్ ఫర్ సైన్స్, ఎన్విరాన్మెంట్ రూపొందించిన ఈ నివేదికను 'డౌన్ టు ఎర్త్' ఆన్లైన్ మ్యాగజైన్ ప్రచురించింది. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నివేదికను రూపొందించారు.
'డౌన్ టు ఎర్త్' ఎడిటర్ సునీత నరైన్ మాట్లాడుతూ..''నివేదకలో కొన్ని గణాంకాలు చాలా ముఖ్య విషయాలు తెలియజేస్తున్నాయి. ప్రభుత్వ పాలనకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. మన ప్రాధాన్యతలను మార్చుకోవాలి. ప్రపంచాన్ని మనం చూసే దృష్టి మారుతుంది. మనం ఏం చేయాలో అవగాహన కల్పిస్తుంది'' అని అన్నారు. శ్వాసకోశ సమస్యలు, మధుమేహం, క్యాన్సర్, స్ట్రోక్స్, గుండె సమస్యలు..మొదలైనవి మరణాలకు ఎక్కువగా కారణమవుతోందని నివేదిక తెలిపింది. ప్రజలు తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తక్కువగా ఉంటున్నాయి. కొంతమంది మాంసం, శీతల పానీయాలు ఎక్కువమొత్తంలో తీసుకోవటం వల్ల అధిక బరువుకు లోనవుతున్నారు.
పర్యావరణంపై ప్రభావం
మనదేశంలో ఆహార అలవాట్లు పర్యావరణంపైనా ప్రభావం చూపుతోందని నివేదికలో పరిశోధకులు తెలిపారు. ఉదాహరణకు పాల ఉత్పత్తులు విపరీతంగా వినియోగిస్తున్నారు. పాల ఉత్పత్తికి పెద్దఎత్తున వ్యవసాయ భూమిని వాడుతున్నారు. గింజ ధాన్యాలకు నీటి వనరులు భారీఎత్తున వ్యయం అవుతున్నాయి. దీనివల్ల వాతావరణంలోకి నైట్రోజన్, ఫాస్పరస్ సమ్మేళనాలు విడుదలవుతున్నాయి. ఇదంతా కూడా సమాజం, పర్యావరణం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. పాలకులు వీటిపై మేల్కోకపోతే దేశం పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుందని, పౌష్టికాహార లోపంతో బాధపడే వారి సంఖ్య భారీగా పెరుగుతుందని అన్నారు. ఆరోగ్యం, పర్యావరణంలో దేశం అనుకున్న లక్ష్యం చేరుకోలేక చతికిల పడుతుందని హెచ్చరించారు.