Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆర్య సమాజ్లో జరిగే వివాహాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆర్య సమాజ్ జారీచేసే వివాహ ధ్రువీకరణ పత్రాలు చెల్లవని స్పష్టం చేసింది. అలాంటి సర్టిఫికెట్లు ఇవ్వడం ఆర్య సమాజ్ పని కాదని తేల్చి చెప్పింది. మధ్యప్రదేశ్లో ఓ ప్రేమ పెండ్లిపై నమోదైన కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ తీర్పు చెప్పింది. ఓ యువకుడు తమ కుమార్తెను కిడ్నాప్ చేసి, లైంగికదాడికి పాల్పడ్డాడంటూ మధ్యప్రదేశ్లో ఓ బాలిక కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ కుమార్తె మైనర్ అని పేర్కొంది. ఆ ఫిర్యాదుమేరకు పోలీసులు సదరు యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో ఈ కేసును సవాల్ చేస్తూ ఆ యువకుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఆ బాలిక మేజరేనని, ఇష్టపూర్వకంగానే ఇంటి నుంచి వచ్చేసి తనను పెండ్లి చేసుకుందని యువకుడు తన పిటిషన్లో పేర్కొన్నాడు. తమ వివాహం ఆర్య సమాజ్ మందిర్లో జరిగిందని చెప్పిన అతడు, కేంద్ర భారతీయ ఆర్య ప్రతినిధి సభ జారీచేసిన వివాహ ధ్రువీకరణ పత్రాన్ని కూడా కోర్టుకు సమర్పించాడు. అయితే ఈ పిటిషన్పై విచారణ జరిపిన అజరు రస్తోగి, జస్టిస్ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఆ వివాహ ధ్రువీకరణ పత్రాన్ని తిరస్కరించింది. ''వివాహ ధ్రువీకరణ పత్రాలు జారీచేయడం ఆర్య సమాజ్ పని కాదు. ఆ అర్హత వాటికి లేదు. కేవలం చట్టపరంగా ఉన్న ప్రభుత్వ అధికారులు మాత్రమే ఆ సర్టిఫికెట్ జారీచేయాలి. మీ కేసులో అలాంటి ధ్రువపత్రాలు ఉంటే తీసుకురండి'' అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆర్య సమాజ్ అనేది హిందూ సంస్కరణల సంస్థ. దీన్ని 1875లో స్వామి దయానంద్ సరస్వతి ఏర్పాటుచేశారు. సనాతన హిందూ మతంలో సంస్కరణలు తీసుకురావాలని, సమాజంలో విలువలను ప్రోత్సహించాలనే ఉద్దేశంత ఈ సమాజ్ను స్థాపించారు. అదే సమయంలో పౌరుల హక్కుల కోసం ఈ సంస్థ పనిచేస్తోంది. కులాంతర వివాహాలను ఆర్య సమాజ్ ప్రోత్సహిస్తోంది. అందుకే ప్రేమ పెండ్లిళ్లకు ఇది వేదికగా మారింది.