Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్కటవుతున్న ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగ సంఘాలు
- త్వరలో యాక్షన్ ప్లాన్ ప్రకటించాలని నిర్ణయం
- కార్మికసంఘాలతో చర్చలు జరుపుతున్నాం : తపన్‌సేన్, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి. మోడీ సర్కార్ తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వరంగ సంస్థల్ని తెగనమ్ముతోంది. దీనిని న్యాయపరంగా ఎలా ఎదుర్కోవాలన్నదానిపైనా ఉద్యోగ సంఘాలు ఆలోచిస్తున్నాయి. దీనికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించాలని నిర్ణయించాయి. ఇందుకోసంగాను ఉద్యోగసంఘాలన్నీ త్వరలో ఒక జాతీయస్థాయి సమావేశం నిర్వహించబోతున్నట్టు సమాచారం. ప్రయివేటీకరణకు అనేక అడ్డంకులు రావటంతో కేంద్రం కొద్ది నెలల క్రితం 'జాతీయ నగదీకరణ' (ఎన్ఎంపీ) పేరుతో ఒక విధానాన్ని ప్రకటించింది.
ప్రభుత్వ సంస్థల్నేగాక, జాతీయ వనరులు, ఆస్తుల్ని సైతం తెగనమ్మే విధానానికి కేంద్రం తెరలేపింది. దీనిని అత్యంత వేగంగా అమల్లోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంది. దీంతో ఇప్పటివరకూ సాగిన నిరసనలు, ఆందోళనలు మరింత విస్త్రతపర్చాలని, పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టాలని ఉద్యోగ సంఘాల నాయకులు భావిస్తున్నారు. తమ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మేథావులు, విద్యావేత్తలు, మాజీ బ్యూరోక్రాట్స్ మద్దతు కూడగట్టాలని నిర్ణయించారు.
సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ మాట్లాడుతూ..''ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమానికి ఉద్యోగ సంఘాలన్నీ సిద్ధమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ కుట్రపూరిత విధానాల్ని అడ్డుకోవాలని కార్మికులు, ఉద్యోగులు నిర్ణయించుకున్నారు. మా వ్యూహం, ప్రణాళిక ఒక్కటే.. అది నిరసనను కొనసాగించటమే. జాతీయ స్థాయిలో ఎలాంటి ఆందోళనా కార్యక్రమాలు చేపట్టగలమో కార్మిక సంఘాలతో చర్చిస్తున్నాం'' అని అన్నారు.
ఎల్ఐసీ ప్రయివేటీకరణ తర్వాత రూ.20వేల కోట్లకుపైగా మొత్తం కేంద్ర ఖజానాలో జమైంది. దీంతో మరింత ఉత్సాహంతో ప్రయివేటీకరణను వేగవంతం చేయాలని
కేంద్రం భావిస్తోంది. గత నెల భారత్ పెట్రోలియం (బీపీసీఎల్)లో 53శాతం ప్రభుత్వ వాటాను అమ్మేందుకు బిడ్డర్లను ఆహ్వానించింది. అయితే దీనికి పెద్దగా స్పందన రాకపోవటంతో బీపీసీఎల్ ప్రయివేటీకరణ తాత్కాలికంగా వాయిదాపడింది. సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, పవన్ హాన్స్ సంస్థల వాటాల అమ్మకం కూడా కేంద్రం అనుకున్నవిధంగా ముందుకు సాగలేదు. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్...మొదలైనవాటిల్లో ప్రభుత్వం తన వాటాల్ని అమ్మకానికి సిద్ధపడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారుగా రూ.65వేల కోట్లు సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
ఎంపీలు, ఎమ్మెల్యేలను కలవబోతున్నాం : బీపీసీఎల్ కార్మికులు
ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా బీపీసీఎల్ రిఫైనరీల్లో నిరసనలు చేపట్టాలని కార్మికసంఘాలు పిలుపునిచ్చాయి. ''ప్రయివేటీకరణను అడ్డుకునేందుకు ఏది చేయాలో అది చేయడానికి కార్మికులు, ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. నిరసనలు ఇకపై కొనసాగించాలని నిర్ణయించాం. ఎంపీలు, ఎమ్మెల్యేల్ని కలుసుకోవాలని, సంతకాలతో మద్దతు కూడగట్టాలని, సంయుక్త మెమోరాండం సమర్పించాలని భావిస్తున్నా''మని కొచిన్ రిఫైనరీ వర్కర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అజి ఎంజీ అన్నారు.
ఉద్యమబాటలో బ్యాంకు ఉద్యోగులు
ఉద్యమ పోరాటాన్ని నిర్ణయించేందుకు, ఇతర అంశాలు చర్చించేందుకు, ఐడీబీఐ బ్యాంక్ ప్రయివేటీకరణను అడ్డుకునేందుకు జూన్ 8న జాతీయ సమావేశం ఏర్పాటుచేయాలని 'యునైటెడ్ ఫోరం బ్యాంక్ యూనియన్స్' పిలుపునిచ్చింది. వచ్చే ఏడాది మార్చి కల్లా ఐడీబీఐ బ్యాంక్‌ను తెగనమ్మేందుకు కేంద్రం ప్రణాళికలు రూపొందించుకుంది. ఈ నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగులు తమ నిరసనల్ని మరింత ఉధృతం చేయడానికి సిద్ధమవుతున్నారని ఆల్ ఇండియా బ్యాంక్ ఉద్యోగుల యూనియన్ ప్రధాన కార్యదర్శి సి.హెచ్.వెంకటాచలం మీడియాకు తెలిపారు. ''బ్యాంకుల్లో ఉన్నదంతా ప్రజల డబ్బు. ఇది ప్రభుత్వరంగంలో ఉంటేనే ఆ సొమ్ముకు భద్రత ఉంటుంది. ప్రభుత్వ పథకాల అమల్లో, ఆర్థిక అభివృద్ధికి బ్యాంకు డబ్బు సద్వినియోగమవుతుంది. ప్రయివేటు చేతుల్లోకి పోతే..అదంతా దెబ్బతింటుంది'' అని వెంకటాచలం అన్నారు.
సెంట్రల్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ ప్రయివేటీకరణను సంస్థ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రయివేటీకరణను సవాల్ చేస్తూ నేషనల్ కంపెనీ లా అప్పిలెట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించబోతున్నామని సీఈఎల్ ఉద్యోగ సంఘం ఉపాధ్యక్షుడు టి.కె.థామస్ చెప్పారు. ఇప్పటికే ఈ అంశంపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్‌పై విచారణ జులై 11న కోర్టు ముందుకు రాబోతోంది.
పోరాటం ఆగదు..
ప్రస్తుతం ప్రభుత్వరంగ సంస్థల ఆవరణలో ఉద్యోగ సంఘాలు పలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిని మరింత ముందుకు తీసుకుపోవాలని ఆంగ్ల న్యూస్ వెబ్‌పోర్టల్ 'న్యూస్ క్లిక్'తో సంఘాల నాయకులు చెప్పారు. ఇది జాతీయ స్థాయిలో సంయుక్తంగా ఉద్యోగ సంఘాలు పోరాటం సాగించడానికి ఉపయోగపడుతుందని అన్నారు. సంస్థల యాజమాన్య హక్కులు కాపాడుకోవటంపై న్యాయస్థానాల్ని ఆశ్రయించాలని భావిస్తున్నారు. త్వరలో జాతీయ సమావేశం ఏర్పాటుచేసి..యాక్షన్ ప్లాన్ రూపొందించబోతున్నట్టు ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు.