Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 5ఏండ్ల చిన్నారికి ఈ వ్యాధి లక్షణాలు
- నమూనాలు సేకరించిన వైద్య అధికారులు
న్యూఢిల్లీ : కొత్తరకం వైరస్ మంకీపాక్స్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నది. అమెరికా సహా అనేక దేశాల్లో మంకీపాక్స్ కేసులు నానాటికీ పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగిపోకముందే మరో వైరస్ ప్రపంచాన్ని వేధిస్తోంది. మనదేశంలో ఈ వైరస్ కేసులు నమోదు కానప్పటికీ... తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ చిన్నారికి మంకీపాక్స్ తరహా లక్షణాలు కన్పించడం కలకలం రేపుతున్నది. యూపీకి చెందిన ఓ ఐదేండ్ల చిన్నారికి శరీరంపై దుద్దుర్లు, బొబ్బలు రావడంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. దీంతో ఆ చిన్నారి నమూనాలను మంకీపాక్స్ టెస్ట్ కోసం సేకరించినట్టు ఘజియాబాద్ చీఫ్ మెడికల్ అధికారి వెల్లడించారు.
ఇది కేవలం ముందు జాగ్రత్త చర్యే అని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సదరు చిన్నారికి ఇతర ఆరోగ్య సమస్యలు ఏవీ లేవని చెప్పారు. ఆమెగానీ, వారి కుటుంబంగానీ గత నెల రోజులుగా ఎలాంటి విదేశీ పర్యటనలూ చేయలేదన్నారు. ఈ వైరస్‌ను 1958లో మొదటిసారిగా కోతుల్లో గుర్తించారు. అందుకే మంకీపాక్స్ అని పేరుపెట్టారు. ఆ తర్వాత 1970ల్లో తొలిసారి మనుషుల్లో ఇది బయటపడింది.
జంతువుల నుంచి మనుషులకు
మంకీపాక్స్ ఒక వైరల్ వ్యాధి. ఇది కూడా స్మాల్‌పాక్స్ కుటుంబానికి చెందినదే. జంతువుల నుంచి మనుషులకు సోకుతున్నది. సాధారణంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాల్లో ఈ వైరస్ అధికంగా వ్యాపిస్తున్నది. తుంపర్ల ద్వారా లేదా వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గరగా ఉండటం వల్ల ఇది ఇతరులకు వ్యాపించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలోకి పూర్తిగా వ్యాప్తి చెందడానికి సాధారణంగా 6 నుంచి 13 రోజులు పడుతుంది. ఒక్కోసారి 5 నుంచి 21 రోజుల సమయం కూడా పట్టొచ్చు.