Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్నదాత ఆదాయానికి దెబ్బ
- ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలి : పీపుల్స్ కమిషన్ డిమాండ్
- బ్లాక్ మార్కెట్లో ఎరువులు... రైతులకు పెరుగుతున్న ఖర్చులు
న్యూఢిల్లీ : దేశంలోని రైతులకు ఎరువుల లభ్యతపై వ్యవసాయ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు ఎరువుల కోసం బ్లాక్ మార్కెట్లో అధికంగా ఖర్చు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా రైతులు తాము కష్టపడి పండించిన పంట ద్వారా ఆదాయాన్ని పొందకపోగా నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. దేశంలో పెరుగుతున్న ఎరువుల ధరలు, గ్లోబల్ సప్లరు చైన్‌కు అంతరాయాన్ని ఉటంకిస్తూ.. ప్రభుత్వం ఫర్టిలైజర్ పాలసీని తీసుకురావాలని పీపుల్స్ కమిషన్ ఆన్ పబ్లిక్ సెక్టార్ అండ్ పబ్లిక్ సర్విసెస్ (పీసీపీఎస్పీఎస్) డిమాండ్ చేసింది. అలాగే, ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్ఈ)ను కేంద్రం నిర్వీర్యం చేయకుండా వాటిని కాపాడాల్సిన అవసరమున్నదని వివరించింది.
ప్రముఖ విద్యావేత్తలు, న్యాయనిపుణులు, మాజీ అధికారులు, ట్రేడ్ యూనియన్ నాయకులు, సామాజిక కార్యకర్తల కలయికతో ఏర్పడిందే పీసీపీఎస్పీఎస్. ఇందులో థామస్ ఇసాక్, ఈ.ఏ.ఎస్ శర్మ, ఎస్.పీ శుక్లా, ఇందిరా జైసింగ్ , సీపీ చంద్రశేఖర్, ఆర్ నాగరాజ్, ప్రభాత్ పట్నాయక్ వంటి నిపుణులు, ప్రముఖులు ఉన్నారు.
ఫర్టిలైజర్ పాలసీ విషయలో పీసీపీఎస్పీఎస్ ఒక ప్రకటనను విడుదల చేసింది. దీని ప్రకారం.. ఇంధన ధరల పెరుగుదలలు, కోవిడ్-19 మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచంలో వ్యవసాయ దేశాలలో ఎరువుల పరిస్థితి దారుణంగా ఉన్నది. ఈ దేశాల నుంచి ఎరువులకు డిమాండ్ పెరిగింది. అయితే, ఎరువుల లభ్యత, వాటి ధరలు.. సంక్లిష్ట పరిస్థితులను ఏర్పరిచాయి.
ఎరువుల కష్టాలతో చిన్న, సన్నకారు రైతులపై తీవ్ర ప్రభావం పడుతున్నది. భారతదేశ వ్యవసాయ రంగంలో 80 శాతం వరకు వీరే ఉన్నారు. బ్లాక్ మార్కెట్లో ఎరవుల కోసం వీరు అధికంగా ఖర్చు చేస్తున్నారు. ఇది వారి ఆదాయలపై ప్రభావం చూపుతుంది. ఒక వేళ ఎరువులే ఉపయోగించకపోతే.. పంట దిగుబడి తగ్గుతుంది. దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోతారు. అలాగే, ఆహార ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటుతుంది. దేశాన్ని పేదరికంలోకి, ఆకలిలోకి నెట్టేస్తుంది.
దేశీయ ఎరువుల పరిశ్రమ వ్యూహాత్మక స్వభావాన్ని గుర్తించాల్సిన అవసరమున్నదని పీసీపీఎస్పీఎస్ తన నివేదికలో హైలెట్ చేసింది. అలాగే, కేంద్రం పీఎస్ఈలను పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా నిర్వీర్యం చేయడం కంటే వాటిని కాపాడుకోవటం ద్వారా స్వావలంబనను పెంపొందించుకోవటం ఈ కాలపు అవసరమని వివరించింది. గత 30 ఏండ్లలో భారత్‌లో ఎరువుల వినియోగం 3.3 శాతంగా పెరిగింది. అయితే, ఉత్పత్తి 2.18 శాతం మాత్రమే ఉన్నదని పేర్కొన్నది. గత పదేండ్లలో ఉత్పత్తి 1.13 శాతం పెరుగుదలను చూసిందని వివరించింది. ఈ మేరకు దేశీయ ఉత్పత్తిని పెంచటం కోసం యాక్షన్ ప్లాన్, తక్కువ పోషక ఎరువులను ప్రోత్సహించటం, వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించటం వంటి వాటిపై దృష్టిని సారించే పలు సూచనలు, డిమాండ్లను పీసీపీఎస్పీఎస్ చేసింది.
దేశీయ ఎరువుల ఉత్పత్తి కోసం ప్రభుత్వం యాక్షన్ ప్లాన్‌ను కలిగి ఉండాలని వివరించింది. ఎరువుల ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రయివేటీకరణకు సంబంధించిన అన్ని చర్యలనూ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని పేర్కొన్నది. ప్రస్తుత సంక్షోభం ప్రభుత్వ రంగ పరిశ్రమల ద్వారా ఎరువుల ఉత్పత్తిని పెంచాలంటున్నదని వివరించింది. అందుబాటులో ఉన్న స్వదేశీ, దిగుమతి చేసుకున్న యూరియా, డీఏపీని మరింత శ్రద్ధగా ఉపయోగించుకోవటం ఈ సమయంలో అవసరమని సూచించింది. సమర్థవంతమైన నేల పరీక్ష, ఎరువుల నిర్వహణ కోసం మరింత సమగ్ర కార్యాచరణ అవసరమని పేర్కొన్నది. అమ్మోనియం సల్ఫేట్, మోనో అమ్మోనియం ఫాస్పేట్ వంటి తక్కువ పోషక పదార్థాలను ఎరువులుగా ప్రోత్సహించాలని సూచించింది. వ్యవసాయ వ్యర్థాలు, వ్యవసాయ భూముల ఎరువును పంటలకు సులభంగా లభించే ఎరువుగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించటానికి దేశవ్యాప్త కార్యక్రమం నిర్వహించాలని పేర్కొన్నది.