Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్షీణించిన కొనుగోలు శక్తి
- కానరాని ఉద్యోగాలు.. ఆకాశాన్నంటుతున్న ధరలు
- నియంత్రించటంలో మోడీ సర్కారు విఫలం
- సామాన్యుడికి తప్పని తిప్పలు
న్యూఢిల్లీ : దేశంలో పెరుగుతున్న ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్, డీజీల్, గ్యాస్ వంటి ఇంధన ధరలు ఆకాశాన్నంటుతూ జేబులకు చిల్లులు పెడుతున్నాయి. అంబానీ, అదానీలు కరోనా కాలంలోనూ ఆస్థులను పెంచుకొని మరింత సంపన్నులుగా మారారు. కానీ, పేద, సామాన్య మధ్య తరగతి ప్రజలు మాత్రం ధరల దాటికి తట్టుకోలేక మరింత పేదలుగా మారుతున్నారు. ఆర్థిక భారాన్ని మోయలేక చేతులెత్తేస్తున్నారు. ఇటు పెరుగుతున్న ధరలను నియంత్రించటంలో మోడీ సర్కారు విఫలమవుతున్నది. నిరుద్యోగులు, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించటంలో బాధ్యతను విస్మరిస్తున్నది. దీంతో ప్రజలు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఫలితంగా వారు కొనుగోలు శక్తిని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటికి పెరుగుతున్న ధరలూ తోడవటంతో ప్రజలు తలకు మించిన భారాన్ని మోయాల్సిన పరిస్థితి ఏర్పడిందని నిపుణులు, విశ్లేషకులు తెలిపారు.
దేశ ఆర్థిక వ్యవస్థపై ఇటీవల విడుదలైన అంచనాలు ఆసక్తికర విషయాలను వెల్లడించాయి. ప్రజలు చాలినంతగా ఖర్చు చేయలేకపోతున్నారని తేలింది. వారికి సరైన ఆదాయం లేకపోవటంతోనే కొనుగోలు శక్తి కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించాయి. మరోపక్క, నిత్యవసరాల ధరల పెరుగుదల దీనిని మరింత సంక్లిష్టం చేసింది.
ఆర్థిక వ్యవస్థకు తోడ్పడని ఎఫ్డీఐ
తమ పాలనలో అనేక లక్ష్యాలను సాధించామని అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లు పూర్తైన సందర్భంగా వేడుకలు చేసుకుంటున్న మోడీ సర్కారు తీరు ప్రస్తుత పరిస్థితులకు విరుద్ధంగా ఉన్నదని నిపుణులు చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించటం, కార్పొరేటు, బడా వ్యాపారవేత్తలకు పన్నులు మినహాయించటం, సంక్షేమ పథకాలకు నిధులను తగ్గించటం లాంటి చర్యలకు దిగిన మోడీ సర్కారు.. సామాన్యుడి ఆర్థిక పరిస్థితిని సరి చేయాలన్న ఆలోచనను మరిచిందని వివరించారు. పలు రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)కు దారులు తెరిచినప్పటికీ.. అది దేశ ఆర్థిక వ్యవస్థకు కానీ, ఉద్యోగాల కల్పనకు కానీ బలాన్ని చేకూర్చలేకపోయిందని ఆర్థిక నిపుణులు చెప్పారు.
క్షీణించిన కొనుగోలు శక్తి
2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీడీపీ తాత్కాలిక అంచనాలను చూస్తే.. తలసరి వ్యక్తిగత తుది వినియోగ వ్యయం (పీఎఫ్సీఈ) రెండేండ్ల క్రితం(2019-20) రూ. 61,594గా ఉండగా.. అది రూ. 61,215కి పడిపోయింది. 2020-21 కరోనా మహమ్మారి కాలంలో ఇది దారుణంగా రూ. 57,279కి క్షీణించింది. పీఎఫ్సీఈ పెరిగితేనే దేశ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకుంటుందని నిపుణులు వివరించారు. ఇక ప్రభుత్వ తుది వినియోగ వ్యయం (జీఎఫ్సీఈ) మహమ్మారి కాలంలో 11.3 శాతం పెరిగింది. 2021-22లో మాత్రం అది 10.7 శాతానికి తగ్గటం గమనార్హం.
పడిపోయిన పారిశ్రామికోత్పత్తి
మోడీ ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధానాలు దేశ పారిశ్రామిక రంగంపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (ఐఐపీ) గతేడాది నుంచి చాలా దారుణంగా పడిపోయింది. గతేడాది మేలో ఐఐపీ 27.6 శాతంగా ఉన్నది. ఆ తర్వాతి నెలలోనే అది దాదాపు సగానికి, అంటే 13.8 శాతానికి పడిపోవటం గమనార్హం. జులైలో 11.5 శాతానికి పడిపోయి.. ఆగస్టులో 13 శాతానికి వచ్చింది. ఇక అప్పటి నుంచి ఈ ఏడాది మార్చి వరకు క్రమంగా తగ్గుకుంటూ వచ్చి 1.9 శాతానికి చేరింది.
ధరల పెరుగుదల
దేశంలోని ప్రజలను ప్రస్తుతం తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రధాన సమస్యలు ధరల పెరుగుదల, నిరుద్యోగం. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ధరలు, నిరుద్యోగం రెండూ పెరిగాయి. ముఖ్యంగా, గత కొన్ని నెలలుగా ఇంధన ధరలు ఆకాశాన్నంటి ప్రజలకు చుక్కలు చూపించాయి. ఫలితంగా, రిటైల్ ద్రవ్యోల్బణం ఈ ఏడాది ఏప్రిల్లో 7.73 శాతంగా నమోదైంది. గత పదేండ్లతో చూస్తే సగటు ధరలు అత్యధికంగా నమోదైన ఏడాదిగా 2021-22 నిలిచింది. ముఖ్యంగా, టోకు ధరల పెరుగుదలలో ఇంధన ధరలు ప్రభావం చూపాయి. ఇందులో వీటి వాటా 25 శాతంగా ఉన్నది.
నిరుద్యోగం
దేశంలోని నిరుద్యోగ సమస్యపై ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ నివేదికలు హెచ్చరించాయి. సీఎంఐఈ ప్రకారం.. దేశంలో 2018 సెప్టెంబర్ నుంచి నిరుద్యోగం 6.5 శాతానికి పైగానే ఉన్నది. దాదాపు 25 శాతం నిరుద్యోగ రేటు 2020 ఏప్రిల్లో నమోదైంది. ఇది కూడా మోడీ సర్కారు విధించిన అనాలోచిత లాక్డౌన్ ఫలితమని ఆర్థిక నిపుణులు తెలిపారు. గతనెల దేశంలో నిరుద్యోగం 7.2 శాతంగా ఉన్నది. ఇందులో పట్టణ ప్రాంతాల్లోని నిరుద్యోగమే అత్యధికంగా 8.2 శాతంగా ఉండటం గమనార్హం.