Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదుగురు మహిళా మంత్రులతోసహా 21 మంది ప్రమాణస్వీకారం
భువనేశ్వర్: ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదివారం మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఐదుగురు మహిళా మంత్రులుసహా 21 మంది ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో 13 మంది కేబినెట్ మంత్రులు, ఎనిమిది మంది సహాయ మంత్రులు (ఇండిపెండెంట్ ఛార్జి) ఉన్నారు. భువనేశ్వర్‌లోని లోక్‌సేవ భవన్ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ గణేశీ లాల్ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీని సన్నద్ధం చేసేందుకు నవీన్ పట్నాయక్ చర్యలు తీసుకుంటున్నారు. మంత్రివర్గంలోని అందరూ రాజీనామా చేయాలని శనివారం సిఎం ఆదేశాలు జారీ చేశారు. గతంలో పనిచేసిన ఆరుగురు కేబినెట్ మంత్రులతో సహా 11 మందిని తొలగించారు. ఏడుగురు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. గతంలో ఇద్దరు మహిళా మంత్రులుండగా, ఈసారి ఆ సంఖ్య ఐదుకు చేరింది. నవీన్ పట్నాయక్ ప్రతిపాదనల మేరకు మంత్రులకు ఆయా శాఖలను గవర్నర్ కేటాయించారు. ఇటీవల స్పీకర్ పదవికి రాజీనామా చేసిన ఎస్ఎన్ పాత్రో పేరు నూతన మంత్రివర్గంలో ఉంటుందని అంతా భావించగా, పాత్రో పేరు తుది జాబితాలో లేదు. శనివారం మంత్రి పదవికి రాజీనామా చేసిన బికె అరుఖా త్వరలో స్పీకర్ పదవిని చేపడతారని రాష్ట్ర మీడియాలో వార్తలు వస్తున్నాయి. 2024లో ఒడిషాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి వరకూ ఐదుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన నవీన్ పట్నాయక్ ఆరోసారి కూడా విజయం సాధించాలని పట్టుదలగా ఉన్నారు. మంత్రి వర్గంలోని కొంతమందిపై విమర్శలు రావడంతో మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరణ చేశారు.