Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మత స్వేచ్ఛ, ముస్లిం హక్కులను భారత్ కాలరాస్తోంది : అరబ్ దేశాలు
భారత రాయబారుల్ని పిలిపించి అధికారికంగా నిరసన వ్యక్తం
- మైనార్టీలపై వేధింపులు పెరిగాయి : ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్
- బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందే : ఖతార్
- ఏం చెప్పాలో తెలియక తలపట్టుకున్న కేంద్రం
- ప్రభుత్వ వ్యాఖ్యలుగా పరిగణలోకి తీసుకోవద్దంటూ దిద్దుబాటు చర్యలు
- ఇదంతా మాకు మామూలే...పార్టీ పెద్దల అండదండలున్నాయి : నుపుర్ శర్మ, జిందాల్
మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా..ప్రపంచం ముందు భారత్ తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. ఖతార్ పర్యటనకు వెళ్లిన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మరికొంత మంది వ్యాపార ప్రముఖులకు అక్కడి ప్రభుత్వం ముందు మొహం చెల్లలేదు. సోమవారం విలేకర్ల సమావేశాన్ని వెంకయ్యనాయుడు రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఉపరాష్ట్రపతి పర్యటన నిమిత్తం ఏర్పాటుచేసిన అధికారిక విందును ఖతార్ రద్దు చేయటం..భారత ప్రతిష్ట, గౌరవానికి నష్టం చేకూర్చింది. సౌదీ అరేబియా, కువైట్, ఒమన్, యూఏఈ, ఇరాన్, పాకిస్తాన్..తదితర దేశాల్లో భారత రాయబారుల్ని పిలిపించి..సమన్లు జారీచేశాయి. భారత ఉత్పత్తుల్ని బహిష్కరించాలని అరబ్ దేశాల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఇంత జరుగుతున్నా ప్రధాని మోడీ మౌనం వీడటం లేదు.
న్యూఢిల్లీ : బీజేపీ నాయకులు నుపుర్ శర్మ, నవీన్‌కుమార్ జిందాల్ చేసిన మత విద్వేష వ్యాఖ్యాలు దేశ ప్రతిష్టను దిగజార్చుతున్నాయి. పాకిస్తాన్, ఖతార్, సౌదీ, కువైట్.. మొదలైన ఇస్లామిక్ దేశాలు భారత ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పలు దేశాలు అధికారికంగా తమ నిరసనను వ్యక్తం చేశాయి. అరబ్ దేశాల్లో భారత్ ఉత్పత్తుల్ని బహిష్కరించాలని పిలుపునిచ్చేంత వరకు పరిస్థితి వెళ్లింది. ఇంత జరుగుతున్నా ప్రధాని మోడీ, అమిత్ షా...వారి అనుచరగణం మౌనాన్ని వహించింది. ఇస్లాంపై ఈస్థాయిలో తీవ్ర వ్యాఖ్యలు, విద్వేషం చెలరేగుతున్నా..ప్రధాని మోడీ మౌనం వహించటం పరిస్థితిని మరింత దిగజార్చింది. ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ ముస్లింల మత విశ్వాసాలపై, ఇస్లాంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
పార్టీ నుంచి సస్పెండ్ చేశాం కదా.. : బీజేపీ
మైనార్టీల హక్కుల ఉల్లంఘనకు అడ్డుకట్ట పడటం లేదని ఆయా దేశాలు భారత రాయబారుల్ని పిలిపించి నిలదీస్తున్నాయి. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, ఢిల్లీ బీజేపీ మీడియా విభాగం అధ్యక్షుడు నవీన్‌కుమార్ జిందాల్‌లను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని బీజేపీ ప్రకటించింది. అయితే తమకు పార్టీ అధినాయకత్వం అండదండలు ఉన్నాయని, ఇదంతా మామూలేనని నుపుర్ శర్మ, నవీన్‌కుమార్ జిందాల్ వ్యాఖ్యానించటం సంచలనంగా మారింది. తాజాగా వారు చేసిన వ్యాఖ్యలు బీజేపీ అసలు స్వరూపాన్ని బయటపెట్టాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా బీజేపీ సర్కార్, బీజేపీ నేతల తీరు..అంతర్జాతీయంగా భారత్ పరువు, ప్రతిష్టలను దెబ్బతీశాయి. భారత ప్రభుత్వం బోనులో నిలబడాల్సి వచ్చిందని, అంతర్జాతీయంగా పలు దేశాలు భారత ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఓ పద్ధతి ప్రకారం హింస..దాడులు : ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్
''భారత్‌లో ఇస్లాం పట్ల విద్వేషం పెరిగిందనడానికి తాజా ఉదంతమే నిదర్శనం. ఒక పద్ధతి ప్రకారం ముస్లింలపై వేధింపులు జరుపుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో హిజాబ్‌ను నిషేధిస్తూ పాలకులు నిర్ణయం తీసుకున్నారు. ముస్లింలను లక్ష్యంగా చేసుకొని దాడులు, హింస పెచ్చుమీరుతున్నాయి'' అని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనను భారత ప్రభుత్వం ఖండించింది. అన్ని మతాలు, సంస్కృతులను భారత్ గౌరవిస్తుందని భారత విదేశాంగ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. బీజేపీ నాయకులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్ని, భారత ప్రభుత్వానికి ఆపాదించవద్దని, అవి వారి వ్యక్తిగత వ్యాఖ్యలుగా చూడాలని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఈ వివాదంపై భారత్ చేపట్టిన దిద్దుబాటు చర్యలు అంతగా ఫలించలేదనే చెప్పాలి. భారత్ తీరుపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు ఆగటం లేదు.
పశ్చిమాసియా దేశాల నిరసన
బీజేపీ నాయకుల వివాదాస్పద వ్యాఖ్యలు మోడీ సర్కారును ఇరకాటంలో పడేేశాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు విద్వేషపూరిత వ్యాఖ్యల పట్ల తమ అసంతృప్తిని, ఆందోళనను తెలియపర్చాయి. ఇరాన్ కూడా భారత రాయబారి పిలిచి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి హొస్సేన్ అమీర్-అబ్-డొల్లాహియన్ భారత్‌లో తొలిసారిగా పర్యటించనుండగా, దీనికి మూడు రోజుల ముందే ఆ దేశం నిరసన తెలిపింది. మరోపక్క, 57 దేశాల ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ బీజేపీ నాయకుల కామెంట్లను తీవ్రంగా ఖండించింది.
బీజేపీ నాయకుల వివాదాస్పద వ్యాఖ్యలు 'గాయపరిచాయి' అని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. మోడీ ప్రభుత్వం మత విశ్వా సాలను అణచివేస్తున్నదనీ, ముస్లింలను వేధిస్తున్నదని ఆయన ఆరోపిం చారు. బీజేపీ నాయకులపై ఆ పార్టీ తీసుకున్న చర్యపై కాంగ్రెస్ స్పందిం చింది. విదేశీ శక్తుల బెదిరింపుల ఒత్తిడితోనే బీజేపీ ఆ ఇద్దరిపై చర్య తీసుకున్నదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రన్‌దీప్ సూర్జేవాలా అన్నారు.