Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీతారాం ఏచూరి విజ్ఞప్తి
- బీజేపీ మత విద్వేషానికి ఖండన
న్యూఢిల్లీ : అధికార పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్న బీజేపీ నేతలను ఏదో చోటా మోటా వ్యక్తులుగా కొట్టిపారేయలేమని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. ఇటీవల బీజేపీ నేతలు, ఇస్లాం వ్యవస్థాపకుడు మహ్మద్ వ్రవక్తను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దేశ విదేశాల్లో పెద్ద దుమారం చెలరేగింది. బీజేపీ మత విద్వేషాన్ని రెచ్చగొడుతోందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దానిపై ఏచూరి స్పందిస్తూ, భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి పనిచేస్తున్న మోడీ ప్రభుత్వం ఇటువంటి మత ఛాందసవాద ధోరణులకు స్వస్తి పలకాలనీ, భారతదేశ లౌకిక ప్రజాస్వామ్య పునాదులను పరిరక్షించాలని కోరారు.
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత నూపుర్ శర్మను పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికీ ఆమెకు అమిత్ షా, జె.పి.నద్దా, ఫడ్నవిస్ వంటి పార్టీ నేతలు మద్దతిస్తున్నారు. ఇందుకు గానూ నూపుర్ బహిరంగంగానే వారికి కృతజ్ఞతలు కూడా తెలియచేశారని సీపీఐ(ఎం) నేత బృందాకరత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేతలందరూ మౌనం పాటించి, కాన్పూర్‌లో అల్లర్లు జరిగేలా చూశారని ఆమె విమర్శించారు. ఇక ఇప్పుడు విదేశాల నుంచి వచ్చిన ఒత్తిడితో వారు బలవంతంగా చర్యలు తీసుకోవాల్సి వచ్చిందనీ, అందుకే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని వ్యాఖ్యానించారు. విద్వేష ప్రసంగాలకు పోషకులుగా వున్న ఈ నేతలే ఈ మొత్తం వ్యవహారానికి బాధ్యులని విమర్శించారు. బీజేపీ ఇచ్చే జాతీయతావాదం నినాదం బూటకమని అన్నారు. ఎందుకంటే మతం ఆధారిత మెజారిటీవాద అభిప్రాయంతో ఇది ముడిపడి వుందని అన్నారు.
కువైట్‌లోని సూపర్ మార్కెట్లో పక్కకు పడేసిన భారత ఉత్పత్తులు!
బీజేపీ నేతల ఇస్లాం వ్యతిరేక వ్యాఖ్యల ప్రభావం గల్ఫ్ దేశాల్లో బాగా కనబడుతోంది. కువైట్‌లో సూపర్ మార్కెట్లోని అరల్లో గల భారతీయ ఉత్పత్తులను లాగి కింద పడేశారు. అల్-అర్దియా సహకార సొసైటీలోని కార్మికులు నిరసనతో భారత్ తేయాకు, ఇతర ఉత్పత్తులను అరల్లో నుంచి తీసేసి ట్రాలీల్లోకి వేసేశారు. బియ్యం బస్తాలు, మసాలా దినుసులు, మిర్చి వాటన్నింటినీ ప్లాస్టిక్ కవర్‌తో చుట్టి పక్కకు పెట్టశారు. ''భారత్ ఉత్పత్తులను మేం తొలగిస్తున్నాం.'' అని అరబిక్‌లో రాసి పెట్టారు. మహ్మద్ ప్రవక్తను అవమానించే వ్యాఖ్యలను కువైట్ ప్రజలు అంగీకరించబోరని ఆ సూపర్ మార్కెట్ సీఈఓ నజీర్ వ్యాఖ్యానించారు.