Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఒడిషాలో 'యథాతథ స్థితి' ఆదేశాల ముసుగులో కేంద్ర ప్రభుత్వం, ఇతర అధికారుల నుంచి అటవీ అనుమతులు (ఫారెస్ట్ క్లియరెన్స్) లేకుండా మైనింగ్ చేయడం అక్రమం అని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఇలాంటి మైనింగ్లను ఆరు నెలల్లో నిర్మూలించాలని రాష్ట్ర హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. 'హైకోర్టు నుంచి యథాతథ స్థితి ఆదేశాలు ఉన్నాయనే ముసుగులో అటవీ అనుమతులు లేకుండా మైనింగ్‌ను ఎలా కొనసాగిస్తారు' అని మైనింగ్ సంస్థలను సుప్రీంకోర్టులో జస్టిస్ ఎం.ఆర్. షా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌తో కూడిన వెకేషన్ బెంచ్ ప్రశ్నించింది. 'అటవీ అనుమతులు లేకుండా ఖనిజాలు తవ్వడం, వెలికితీయడానికి మీరు అనుమతించబడరు, హైకోర్టులు యథాతథా స్థితి జారీయడం, మైనింగ్ కొనసాగించడానికి అనుమతించడం దురదృష్టకరం' అని తెలిపింది. ఒడిషా హైకోర్టు తమకు యథాతథ స్థితి జారీ చేయడం లేదని ఆరోపిస్తూ బాలాసోర్ అల్లోయస్ లిమిటెడ్ ఆఫ్ ఒడిషా అనే సంస్థ దాఖలు చేసిన పిటీషన్ విచారణలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. సంస్థ తన పిటీషన్‌ను ఉపసంహరించుకోవడానికి అనుమతించింది. అయితే మైనింగ్ చేయడానికి సంస్థకు అనుమతి ఇవ్వడం లేదని తెలిపింది. అటవీ అనుమతులు లేకుండా మైనింగ్ చేయడం చట్ట విరుద్ధమని, అలా చేయకూడదని పేర్కొంది. అటవీ అనుమతుల దరఖాస్తు పెండింగ్‌లో ఉన్నంత మాత్రాన మైనింగ్‌కు అనుమతి ఉండదని తెలిపింది.