Authorization
Mon Jan 19, 2015 06:51 pm
త్వరలో ముగియనున్న ఆ ముగ్గురు రాజ్యసభ ఎంపీల పదవీ కాలం
- ఇప్పటికే ఏ ఒక్క రాష్ట్ర అసెంబ్లీలోనూ పార్టీకి ఆ వర్గం నుంచి సభ్యులు లేరు
- మత, ద్వేశరాజకీయాలతోనే కాషాయ పార్టీకి ఈ పరిస్థితి: రాజకీయ విశ్లేషకులు
న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా చెప్పుకొంటున్న బీజేపీలో వచ్చే నెల (జులై)7 తర్వాత కనీసం ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ కానరారు. లోక్సభ, రాజ్యసభలో ఎంపీగా కానీ, దేశంలోని 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని అసెంబ్లీల్లో ఎమ్మెల్యేగా కానీ ఆ పార్టీ తరఫున ఉండరు. ఇప్పటికే రాష్ట్రాల అసెంబ్లీలలో ఆ పార్టీ నుంచి ఏ ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా లేరు. బీజేపీకి చెందిన ముగ్గురు ముస్లిం ఎంపీలూ.. రాజ్యసభ నుంచి ఉన్నారు. వారి పదవీ కాలం త్వరలో ముగియనున్న తరుణంలో చట్ట సభల్లో బీజేపీ నుంచి ముస్లిం ప్రాతినిధ్యం శూన్యం కానున్నది.
భారత పార్లమెంటులోని ఉభయ సభలు (లోక్సభ, రాజ్యసభ), అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని అసెంబ్లీలలో మొత్తం 4,908 స్థానాలున్నాయి. లోక్సభలో మొత్తం 543 సీట్లు, రాజ్యసభలో 245 స్థానాలున్నాయి. ఇక అసెంబ్లీల నుంచి 4120 సీట్లున్నాయి. ప్రస్తుతం బీజేపీ లోక్సభలో అత్యధిక మెజారిటీని కలిగి ఉన్నది. అలాగే, 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అధికారంలో ఉన్నది. కానీ, వీటిలో బీజేపీ తరఫున ఒక్క ముస్లిం ప్రజాప్రతినిధి కూడా లేరు. 'సబ్ కా సాత్, సబ్ కా వికాస్' అనే నినాదాన్ని వినిపించే బీజేపీలోనే అది కనిపించటం లేదని రాజకీయ విశ్లేషకులు వివరించారు.
ముక్తార్ అబ్బాస్ నఖ్వీనే చివరి ఎంపీ..!
కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఆ పార్టీ చివరి ముస్లిం ఎంపీ కానున్నారు. బీజేపీకి ఉన్న ముగ్గురు ముస్లిం ఎంపీలు రాజ్యసభకు చెందినవారే. అయితే, ఈ ముగ్గురి పదవీ కాలం త్వరలో ముగియనున్నది. ఇందులో జర్నలిస్టు, కేంద్ర మాజీ మంత్రి ఎం.జే అక్బర్ జూన్ 29న రాజ్యసభ ఎంపీగా రిటైర్ కానున్నారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న సయ్యద్ జాఫర్ ఆలం రాజ్యసభ పదవీ కాలం జులై 4తో ముగియనున్నది. ఆ తర్వాత కేవలం మూడు రోజుల వ్యవధిలో అంటే జులై 7 ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి రాజ్య సభ ఎంపీగా చివరి రోజు కానున్నది. దీంతో బీజేపీ తరఫున ఏ చట్టసభలోనైనా ముస్లిం సభ్యుడు కానరాని పరిస్థితి ఏర్పడనున్నది. బీజేపీ తరఫున చివరగా లోక్సభలో ముస్లిం ఎంపీగా షానావాజ్ హుస్సేన్ ఉన్నారు. ఆయన 2009లో బీహార్లోని భాగల్పూర్ స్థానం నుంచి విజయం సాధించారు.
2014,2019 లోక్సభ ఎన్నికల్లో గెలవనీ బీజేపీ ముస్లిం అభ్యర్థులు
దేశంలో 2014, 2019 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అత్యధిక లోక్సభ స్థానాలను గెలుచుకొని కేంద్రంలో బీజేపీ దాని మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, ఈ ఎన్నికలలో బీజేపీ పార్టీ తరఫున ఏ ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా విజయం సాధించకపోవటం గమనార్హం. 2014 ఎన్నికల్లో బీజేపీ ఏడుగురు ముస్లింలు, 2019లో ఆరుగురు ముస్లింలను లోక్సభ అభ్యర్థులుగా నిలబెట్టింది.
బీజేపీ పట్ల ఆ వర్గంలో వ్యతిరేకత
బీజేపీ ముఖ్యంగా ముస్లింలు అత్యధికంగా ఉండే ప్రాంతాల నుంచి ఆ వర్గానికి చెందిన వారిని లోక్సభ అభ్యర్థులుగా రంగంలోకి దించింది. అయితే, బీజేపీ మతతత్వ, ద్వేశపూరిత రాజకీయాలతో సాధారణంగానే ముస్లింలలో ఆ పార్టీ పట్ల వ్యతిరేకత ఉన్నది. దీంతో వారు బీజేపీకి ఓటు వేయడానికి ఇష్టపడకపోవటం ఆ పార్టీ తరఫు ముస్లిం అభ్యర్థుల ఓటమికి కారణమని రాజకీయ విశ్లేషకులు వివరించారు. ముస్లింలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలన్న ఆసక్తి ఆ పార్టీకి ఉంటే.. గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న స్థానాల నుంచి వారికి అవకాశం కల్పించేదని తెలిపారు.
ఇటు రాష్ట్రాల్లోని అసెంబ్లీల్లోనూ ఇవే పరిస్థితులు కనిపించాయి. దేశంలోని ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీలలో ఒక్క ముస్లిం సభ్యుడూ ఆ పార్టీ తరఫున లేకపోవటం గమనార్హం. 2013 నుంచి 2016 మధ్య ఆ పార్టీ తరఫున నలుగురు ముస్లిం అభ్యర్థులు గెలిచారు. జమ్మూకాశ్మీర్, అసోం నుంచి ఒక్కరు చొప్పున, రాజస్థాన్ నుంచి ఇద్దరు చొప్పున ఉన్నారు. అయితే, 2021 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున చివరి ముస్లిం ఎమ్మెల్యేగా ఉన్న అమినుల్ హక్ లస్కర్ 2021 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవి చూశారు. దీంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల నుంచి బీజేపీ తరఫున ఏ ఒక్క ముస్లిం సభ్యుడూ లేని పరిస్థితి ఏర్పడింది.