Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రూ.800 కోట్ల విలువైన ఆస్తులు
- బ్లాక్ మనీ యాక్ట్ ప్రయోగం
న్యూఢిల్లీ : ప్రముఖ వ్యాపారవేత్త అనీల్ అంబానీ నల్లడబ్బుతో విదేశాల్లో భారీగా ఆస్తులను కూడబెట్టారు. రిలయన్స్ అడాగ్ ఛైర్మన్‌గా ఉన్న అనీల్ అంబానీ బ్యాంక్‌ల నుంచి తీసుకున్న అప్పులు చెల్లించలేనని.. తాను దివాళా తీశానని బ్రిటన్ కోర్టుకు తెలిపారు. ఆయన కంపెనీలు అప్పులు చెల్లించలేక ఎన్సీఎల్టీకి వెళ్లాయి. కాగా.. రూ.800 కోట్ల విలువైన వెల్లడించని విదేశీ ఆస్తులు, పెట్టుబడులకు సంబంధించి అనిల్ అంబానీపై బ్లాక్ మనీ యాక్ట్ (బిఎంఎ) ప్రయోగిస్తూ ఆదాయ పన్ను విభాగం ఆదేశాలు జారీ చేసింది. 2022 మార్చిలో 'ఫారెన్ ట్యాక్స్ అండ్ ట్యాక్స్ రీసెర్చ్ (ఎఫ్‌టీటీఆర్)' ముంబయి విభాగం ఈ ఆదేశాలను జారీ చేసింది. రూ.800 కోట్ల లావాదేవీలతో ముడిపడిన విదేశీ బ్యాంక్ అకౌంట్లు, విదేశీ కంపెనీలు, లావాదేవీల వివరాలను ఇందులో వెల్లడించింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఆధారంగా ఆధారంగా ఈ విలువను లెక్కగట్టినట్టు స్పష్టం చేసింది.
వాస్తవానికి 2019లోనే రూ.800 కోట్ల విదేశీ ఆస్తులను గుర్తించారు. వీటికి సంబంధించి మార్చి 2022లో నల్లధన చట్టం ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ఆదాయ పన్ను విభాగం అధికారులు అడిగిన ప్రశ్నలకు అనిల్ అంబానీ కంపెనీ నుంచి సమాధానం రాలేదని సమాచారం. కాగా రిలయన్స్ గ్రూప్ దివాళా తీసినట్టు 2020లో బ్రిటన్ కోర్టుకు అనిల్ అంబానీ వెల్లడించారు. తన నికర ఆస్తుల విలువ సున్నాగా పేర్కొన్నారు. మూడు చైనా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల చెల్లింపుల విషయంలో అనిల్ అంబానీ ఈ సమాధానమిచ్చారు. బీఎంఏ జారీ చేసిన ఆదేశాల్లో పలు కీలకమైన వివరాలు ఉన్నాయని సమాచారం.
బహమాస్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్ దేశాల్లో ఉన్న విదేశీ కంపెనీ లబ్దిదారు అనిల్ అంబానీయేనని ఆదాయ పన్నుశాఖ గుర్తించింది. బహమస్‌లో డైమండ్ ట్రస్ట్‌ను 2006లో స్థాపించారని పేర్కొంది. డ్రీమ్‌వర్క్ హోల్డింగ్ కంపెనీ సహకారంతో దీనిని ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి బహమాస్ ప్రభుత్వం నుంచి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) విభాగం ఫారెన్ ట్యాక్స్ అండ్ ట్యాక్స్ రీసెర్చ్(ఎఫ్‌టీటీఆర్)కి సమాచారం లభించింది. ఈ సమాచారంలో స్విస్ బ్యాంక్ అకౌంట్ కూడా ఉంది. జ్యూరిచ్‌లోని యుబిఎస్ బ్యాంక్ బ్రాంచ్‌లో ఈ ఖాతా ఉందని వెల్లడయ్యింది. 2010లో మరో దొంగ కంపెనీని స్థాపించారని రిపోర్ట్ పేర్కొంది. నార్త్ అట్లాంటిక్ ట్రేడింగ్ అన్లిమిటెడ్ పేరుతో ఏర్పాటు చేశారు. దీనిని బ్యాంక్ ఆఫ్ సైప్రస్‌తో అనుసంధానం చేయబడింది. దేశంలో ఒకప్పుడు బడా కార్పొరేట్‌గా ఉన్న అనీల్ అంబానీ ఇప్పుడు దివాలా తీశారు. మోడీ ప్రభుత్వం ఆయనకు ఆర్థిక మద్దతును ఇవ్వడానికి దేశ రక్షణలో ఉపయోగించే రాఫెల్ విమానాల తయారీ కాంట్రాక్టును అప్పగించింది. దీనిపై తీవ్ర ఆందోళనలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే.