Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుత్వ లక్ష్యాలు, ప్రమాణాలు, వాగ్ధానాల్ని నెరవేర్చటంలో పాలకులు వైఫల్యం
- నదులు, సముద్ర తీర ప్రాంతాల్లో భారీగా పెరిగిన కాలుష్యం
- ప్రతికూల వాతావరణంతో వలసబాట పడుతున్న తీరప్రాంత రైతులు
- భరించలేనంతగా వేడి గాలులు : పర్యావరణ నివేదిక
న్యూఢిల్లీ : పర్యావరణ పరిరక్షణలో భారత్ దారుణంగా విఫలమైందని 'సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మేంట్' తాజా నివేదిక (స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మేంట్) తెలిపింది. పర్యావరణంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో వాగ్ధానాలు, ప్రమాణాలు చేశాయని, పాలకులు అవన్నీ గాలికి వదిలేశారని నివేదిక పేర్కొన్నది. కార్బన్ ఉద్గారాల్ని తగ్గించే లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 17 కార్యక్రమాల్లో 15 పథకాల డెడ్‌లైన్ ఈ ఏడాదితో ముగియనున్నది. ఇవి ప్రారంభం కాకుండానే వాటి డెడ్‌లైన్ ముగుస్తోందని నివేదిక తెలిపింది. మొత్తంగా భారత్‌లో పర్యావరణం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుందని నివేదికలో పలు అంశాల్ని పొందుపర్చింది. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ నివేదికలోని అంశాలు చర్చనీయాంశమయ్యాయి.
కేంద్ర ప్రభుత్వం పర్యావరణంపై విడుదల చేసిన పలు గణాంకాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించామని 'సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మేంట్' (సీఎస్ఈ) తెలిపింది. భారత్‌పై అంతర్జాతీయ నివేదికలు, వివిధ ప్రభుత్వ శాఖల గణాంకాలు, సర్వేలు, డాటాబేస్ ఆధారంగా తమ పరిశోధకులు నివేదికను రూపొందించారని సీఎస్ఈ ప్రకటించింది. ఇందులోని ముఖ్యాంశాలు ఈవిధంగా ఉన్నాయి.
ముందుకొస్తున్న సముద్రం
భారత్‌లో 6907 కిలోమీటర్ల సముద్ర తీరప్రాంతం కోతకు గురవుతోంది. 1990-2018 మధ్యకాలంలో ఊహించని స్థాయిలో తీరప్రాంతం కుదించుకుపోయింది. పశ్చిమబెంగాల్లో అత్యధికంగా 60శాతం తీరప్రాంత కోత నమోదైంది. మరో ముఖ్యమైన ప్రమాదం.. దేశవ్యాప్తంగా మునుపెన్నడూ లేనంతగా వేడి గాలులు వీస్తున్నాయి. ఈసారి ఎండలు జనాన్ని హడలెత్తించాయి. గత 120ఏండ్లలో ఎన్నడూలేనంత స్థాయిలో అత్యధిక వేడి ఈ ఏడాది మార్చిలో నమోదైంది. ఇలాంటి వేడితో కూడిన సంవత్సరాలు ముందు ముందు మరిన్ని రాబోతున్నాయి.
కాలుష్యం బారిన నదులు
సెంట్రల్ వాటర్ కమిషన్ విడుదల చేసిన గణాంకాలు పరిశీలిస్తే, 28 రాష్ట్రాల్లో 764 నదుల్లో నీటి కాలుష్యం పెరిగింది. 2018-20 మధ్యకాలంలో ఈ పరిశీలన జరగ్గా, ప్రతి నాలుగు నదుల్లో మూడు నదులు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. లెడ్ (సీసం), ఇనుము, నికెల్, కాడ్మియం, ఆర్సెనిక్, క్రోమియం, కాపర్...తదితర భార లోహాలు నదుల్లో ప్రవహించే నీటిలో కలిసిపోయాయి. 117 నదులు, వాటి ఉప నదులు ఈ భార లోహాలతో కలుషితం అవుతున్నాయి. గంగా పరివాహక ప్రాంతంలో 33 చోట్ల నీటికి పరీక్షలు చేయగా, 10 చోట్ల కాలుష్యం అత్యధిక స్థాయిలో ఉందని తేలింది.
విపత్తులు, ప్రకృతి వైపరిత్యాలు
పర్యావరణంలో వస్తున్న అనూహ్య మార్పులు విపత్తులకు, ప్రకృతి వైపరిత్యాలకు దారితీస్తోందని పరిశోధకులు తెలిపారు. దీనివల్ల ప్రజలు పెద్ద ఎత్తున వలస బాట పట్టాల్సి వస్తోందట. 2020లో ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న అంతర్గత వలసల్లో 76శాతం ప్రకృతి విపత్తులే కారణమని తేలింది. అంతర్గత వలసల్లో చైనా, ఫిలిప్పైన్స్, బంగ్లాదేశ్ తర్వాత భారత్ నాలుగో స్థానంలో ఉంది. పర్యావరణ ప్రతికూలతలు ఎంతోమందిని బలవంతంగా వలస వెళ్లేట్టు చేస్తోంది. మానవ అక్రమ రవాణాకు సైతం దారితీస్తోంది.
ఆహార ద్రవ్యోల్బణం
పంట దిగుబడులు దెబ్బతిని..ఆహార ఉత్పత్తుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఆహార ద్రవ్యోల్బణం(7.79శాతం) భారత్‌లో ఈఏడాది ఏప్రిల్‌లో 8ఏండ్ల గరిష్టానికి చేరుకుంది. పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టే చర్యల్ని పాలకులు పూర్తిగా పక్కకు పెట్టారు. ప్రభుత్వం ఎంచుకున్న 17 పర్యావరణ లక్ష్యాల్లో 15..నెరవేరకుండానే ఆగిపోయాయి. భారత్‌లో పంటల సాగుకు రైతు ఎంతో ఖర్చు చేయాల్సి వస్తోందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక ఇటీవల వెల్లడించింది. 2012-13 నుంచి 2018-19 మధ్యకాలంలో సాగు వ్యయం 35శాతం పెరిగిందని ఆ నివేదిక పేర్కొన్నది.