Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం మానిటైజేషన్ యోచన
న్యూఢిల్లీ : దేశంలో ఇటీవల కృత్రిమ బొగ్గు కొరతను సృష్టించిన కేంద్ర ప్రభుత్వం.. ఆ సాకుతో ఇప్పుడు బొగ్గు గనులను ప్రయివేటుకు అప్పగించే కుట్రను వేగవంతం చేసింది. 2023 మార్చి 31 నాటికి రూ.75,220 కోట్ల విలువ చేసే గనులు వాటి అనుబంధ కార్యకలాపాలను కార్పొరేట్లకు విక్రయించడానికి ప్రణాళికలు రూపొందించినట్టు సమాచారం. 2022-23లో నగదీకరణ (మానిటైజేషన్)లో భాగంగా బొగ్గు గనుల నుంచి రూ.52,200 కోట్ల రెవెన్యూ సమీకరించాలనీ, మరో రూ.20,320 కోట్లు బొగ్గు గనుల అభివృద్ధి మరియు నిర్వహణ (ఎండీఓ), మరో గనులను డిస్కంటిన్యూ చేయడంతో రూ.2000 కోట్లు, వాషరీస్లో రూ.700 కోట్లు చొప్పున విలువ చేసే ఆస్తులను అమ్మకానికి పెట్టనుంది. ఈ కాలానికి బొగ్గు గనుల రంగంలో రూ.6,0660 కోట్ల విలువ చేసే ఆస్తులను మాత్రమే విక్రయించాలని నిటి ఆయోగ్ లక్ష్యాంగా పెట్టుకుంది. 2021-22లోనూ రూ.3,394 కోట్ల మానిటైజేషన్ లక్ష్యంగా పెట్టుకోగా... ఏకంగా బొగ్గు మంత్రిత్వ శాఖ రూ.40,090 కోట్ల విలువ చేసే ఆస్తులను ప్రయివేటుపరం చేసింది. ఇందులో రూ.28,986 కోట్ల బొగ్గు గనులను విక్రయించగా, ఎండీఓ పద్దతిలో రూ.9,592.64 కోట్లు, కోల్ బెడ్ మిథేన్ (సీబీఎం) ప్రాజెక్టుల నుంచి రూ.1,512 కోట్లు చొప్పున సమీకరించింది. అంటే ఈ మొత్తం విలువ చేసే బొగ్గు గనుల ఆస్తులను ప్రయివేటు వర్గాలకు కట్టబెట్టింది. నగదీకరణలో 39 బ్లాక్‌లను విక్రయించడం ద్వారా రూ.28,986 కోట్లు రాబట్టుకోవాలనేది నిటి ఆయోగ్ అంచనా వేసిందని ఆ మంత్రిత్వ శాఖ పేర్కొంది. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ ద్వారా 2021 నుంచి 2025 మధ్య కాలంలో 160 బొగ్గు గనులను విక్రయించాలనేది మోడీ సర్కార్ ఇది వరకు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రంగంలో గౌతం అదానీకి భారీ లబ్దిని చేకూర్చడానికి మోడీ సర్కార్ ఇటీవలే ఎన్టీపీసీకి బొగ్గు సరఫరాతో ద్వారాలు తెరిచిన విషయం తెలిసిందే. ఎన్టీపీసీకి 62.5 లక్షల టన్నుల దిగుమతి బొగ్గు సరఫరాకు అదానీతో ఒప్పందం కుదిరింది. దీని విలువ రూ.6,585 కోట్లుగా ఉంది. ఈ బొగ్గుతో ఒక్కో యూనిట్ విద్యుత్ తయారీ వ్యయం రూ.7-8కి చేరొచ్చని అంచనా. అదే కోల్ ఇండియా అందించే బొగ్గు ధరతో రూ.2కే ఒక యూనిట్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. దిగుమతి, ప్రయివేటు బొగ్గుతో దేశంలో విద్యుత్ సహా ఇతర బొగ్గు ఆధారిత ఉత్పత్తుల ధరలు భారీగా పెరగనున్నాయి.