Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీం కోర్టులో ఈ అంశంపై విచారణ
న్యూఢిల్లీ: షెడ్యూల్డ్ ఏరియాల్లో వందశాతం రిజర్వేషన్ల ఉత్తర్వులకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం మధ్యవర్తిత్వం, సయోధ్య ప్రాజెక్టు కమిటీ (ఎంసీపీసీ)కి చెల్లించాల్సిన రూ.2.5 లక్షలు రెండు వారాల్లో చెల్లించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. చేబ్రోలు లీలా ప్రసాదరావు తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన వెకేషన్ బెంచ్ విచారించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2022 మే 19న రూ.2.5 లక్షలు డిపాజిట్ చేసినట్టు రిజిస్ట్రీ ఆఫీస్ రిపోర్టు ద్వారా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది. ఏపి ప్రభుత్వం చెల్లించినప్పటికీ తెలం గాణ ప్రభుత్వం ఎందుకు చెల్లించలేదంటూ ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. రెండు వారాలు గడువు ఇస్తే డిపాజిట్ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది ఆకాంక్ష మెహ్రా ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. న్యాయవాది విజ్ఞప్తిని అంగీకరించిన ధర్మాసనం రెండు వారాల్లో చెల్లించకపోతే అంశాన్ని తీవ్రంగా పరిగణించి, ప్రభుత్వ ప్రధాన కార్య దర్శిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వ డిపాజిట్‌ను ఎంసీపీసీకి బదిలీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అనంతరం విచారణ ముగిస్తున్నట్టు పేర్కొంది. షెడ్యూల్డు ఏరియాల్లో వందశాతం రిజర్వేషన్లు కల్పించడం తగదని తీర్పు ఇచ్చినప్పటికీ, ఉమ్మడి ఏపి ప్రభుత్వం 2000లో మరోసారి ఉత్తర్వులు జారీ చేయడంతో ఏపీ, తెలంగాణలకు సుప్రీం కోర్టు రూ.2.5 లక్షల చొప్పున మధ్యవర్తిత్వం, సయోధ్య ప్రాజెక్టు కమిటీ (ఎంసీపీసీ) చెల్లించాలంటూ 2020 ఏప్రిల్ 23న ఆదేశాలు జారీ చేసింది.