Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో వైద్యుల కొరత తీవ్రంగా ఉన్నా పట్టించుకోరా..?
- కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ : ఈ ఏడాది 1,450 పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు ఖాళీగా ఉండటంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. దేశంలో వైద్యుల కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో మెడికల్ సీట్లను ఖాళీగా వదిలేయటం సరికాదని స్పష్టంచేసింది. 'మీరు వైద్యుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు' అని కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. అదనంగా మాప్ అప్ కౌన్సెలింగ్ నిర్వహించి ఈ సీట్లను ఎందుకు భర్తీ చేయలేదో వివరిస్తూ 24 గంటల్లో అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ)ని ఆదేశించింది. వైద్యుల జీవితాలతో, వారి భవిష్యత్తుతో ఆడుకుంటున్నందుకు నష్ట పరిహారం చెల్లించాలని కేంద్రాన్ని ఆదేశించే విషయాన్ని పరిశీలిస్తామని హెచ్చరించింది. కనీసం ఒక్క సీటు ఖాళీగా ఉన్నా, దానిని భర్తీ చేయాలని, వృథా కానివ్వరాదని తెలిపింది. నీట్ పీజీ 2021-22 చివరి మాప్ అప్ కౌన్సెలింగ్ మే 7న ముగిసింది. 1,456 మెడికల్ పీజీ సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. స్పెషల్ స్ట్రే రౌండ్ కౌన్సెలింగ్‌ను నిర్వహించి ఈ సీట్లను భర్తీ చేయాలని ఏడుగురు డాక్టర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ''మీకు (కేంద్ర ప్రభుత్వానికి) చాలా మంది డాక్టర్లు, సూపర్ స్పెషలిస్టులు అవసరమైనపుడు, ఈ సీట్లను ఖాళీగా ఉంచుకోవడం వల్ల మీకు ఏం వస్తుంది? మీరు మరొక మాప్ అప్ రౌండ్ నిర్వహించి ఉండవలసింది. ప్రతిసారీ కోర్టు జోక్యం చేసుకోవలసి వస్తోంది. కోర్టు ఆర్డర్ కోసం ఎందుకు వేచి చూస్తున్నారు? వైద్యుల భవిష్యత్తుకు సంబంధించిన తీవ్రమైన విషయం ఇది. మీరు వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు, మన దేశంలో డాక్టర్ల కొరత తీవ్రంగా ఉంది'' అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.