Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెపోరేటు 50 బేసిస్ పాయింట్లు పెంపు
- ధరలు ఇంకా పెరగొచ్చు
- క్రెడిట్ కార్డ్‌తోనూ డిజిటల్ చెల్లింపులు
- వృద్ధి 7.2 శాతమే :ఆర్బీఐ ఎంపీసీ నిర్ణయాల వెల్లడి
న్యూఢిల్లీ : అధిక ధరలతో ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న సామాన్యులపై ఆర్బీఐ మరోసారి వడ్డీ రేట్ల పిడుగు వేసింది. కీలక వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో గృహ, వాహన, రిటైల్ తదితర ఇతర రుణ వాయిదాల చెల్లింపులు భారం కానున్నాయి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన మూడు రోజుల పాటు సాగిన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశాలు బుధవారం నాటితో ముగిశాయి. భేటీ వివరాలను శక్తికాంత దాస్ మీడియాకు వెల్లడించారు. ఆ అంశాలు.. రెపో రేటును గత నెలలో 40 బేసిస్ పాయింట్లు పెంచిన ఆర్బీఐ.. తాజాగా మరో 50 బేసిస్ పాయింట్లు పెంచి 4.9 శాతానికి చేర్చింది. కీలక వడ్డీ రేట్లను పెంచడంతో బ్యాంక్‌లు, ఇతర విత్త సంస్థలు కూడా రుణాలపై వడ్డీ రేట్లను పెంచనున్నాయి. ఇప్పటికే రుణాలు పొందిన, తీసుకోబోయే వారిపైనా ఈ భారం పడనుంది. ఈఎంఐలలో మార్పు చేసుకోని వారికి వాయిదాల నెలల సంఖ్య పెరుగుతుంది. ధరలు మరింత పెరుగొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో ద్రవ్యోల్బణం సూచీ 5.7శాతం నుంచి 6.7శాతానికి చేరొచ్చని పేర్కొంది. జూన్‌తో ముగిసే తొలి త్రైమాసికం (క్యూ1)లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.5 శాతంగా, క్యూ2లో 7.4 శాతం, క్యూ3లో 6.2 శాతం, వచ్చే మార్చితో ముగిసే నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 5.8 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. దీంతో భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదని శక్తికాంత దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. కొద్ది రోజులుగా టమాటాలు, ముడి చమురు ధరలు పెరుగుదలను ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత ఏడాది ఏప్రిల్‌లో టోకు ద్రవ్యోల్బణం సూచీ ఏకంగా 15.08 శాతానికి ఎగిసి.. 13 నెలల గరిష్టానికి చేరిన విషయం తెలిసిందే.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.2 శాతానికి పరిమితం కానుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఇంతక్రితం 2021-22లో 8.7 శాతం వృద్ధి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు దేశీయ ఆర్థిక వ్యవస్థకు సవాల్ విసురుతున్నాయని శక్తికాంత దాస్ అన్నారు. రష్యా- ఉక్రెయిన్ పరిణామాలతో ద్రవ్యోల్బణంపై మరింత ఒత్తిడి పెరిగిందన్నారు. పట్టణ సహాకార బ్యాంక్‌లు ఇంటి వద్దకు బ్యాంకింగ్ సేవలను ప్రారంభించేందుకు అనుమతిస్తున్నా మన్నారు.
క్రెడిట్ కార్డులతో యూపీఐ చెల్లింపులు..
డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి క్రెడిట్ కార్డులతోనూ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఖాతాలను అనుసంధానించడానికి అనుమతినివ్వనున్నట్లు శక్తికాంత దాస్ తెలిపారు. ఇందుకోసం నేషనల్ పేమెంట్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)కి ఆదేశాలు జారీ చేయనున్నట్టు వెల్లడించారు. ముందుగా రూపే క్రెడిట్ కార్డులను యుపీఐకి అనుసంధానించేందుకు అవకాశం ఇవ్వనున్నామన్నారు. ఇప్పటి వరకు డెబిట్ కార్డులను మాత్రమే గూగుల్ పే, ఫోన్ పే, పేటియం తదితర యుపీఐ సేవలకు అనుమతించడానికి అవకాశం ఉంది. తాజాగా క్రెడిట్ కార్డులను ఇందుకు అనుమతిస్తే డిజిటల్ చెల్లింపులు భారీగా పెరగనున్నాయి.