Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వంద రోజుల్లో 41,021 భూమి పత్రాల అందజేత
- గత ఆరేండ్లలో 2.34 లక్షలకు పైగానే..!
- లబ్దిదారుల హర్షాతిరేకాలు
తిరువనంతపురం : కేరళలోని వామపక్ష ప్రభుత్వం భూమి లేని వారికి తోడుగా నిలుస్తున్నది. భూ పంపిణీతో వారికి ధైర్యాన్ని కల్పిస్తున్నది. ఇందులో భాగంగా గత వంద రోజుల్లో 41,021 మందికి భూమి పత్రాలను అందజేసింది. అలాగే, గత ఆరేండ్లలో విజయన్ సర్కారు రాష్ట్రంలోని 2,34,567 మందికి ల్యాండ్ డాక్యుమెంట్స్‌ను పంపిణీ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రణాళికపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ''మేం ఇక్కడ 23 ఏండ్లుగా నివసిస్తున్నాం. కానీ, భూమి హక్కు పత్రాలు పొందటానికి మాకు చాలా ఏండ్లు పట్టింది'' అని తిరువనంతపురం జిల్లాలోని పలోడ్ దగ్గర పలోలీ కాలనీలో నివసిస్తున్న 40 కుటుంబాల్లో ఒకరైన గోపినాథన్ అషరీ అన్నారు. ఇది మా అందరి కల నెరవేరే క్షణం అని శాంత, శాంతిని, లీలా సంతోషం వ్యక్తం చేశారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా కేరళ రెవెన్యూ మంత్రి కె. రాజన్ గత నెల 17న వీరికి భూమి పత్రాలను అందజేశారు.
ఫిబ్రవరి 11న మొదలైన వంద రోజుల ప్రణాళిక గతనెల 20తో ముగిసింది. ఈ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా కేరళ ప్రభుత్వం 41,021 భూమి పత్రాలు అందజేసింది. రాష్ట్రంలో భూమి, ఇండ్లు లేనివారి సమస్యను దూరం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి విజయన్ గతవారం కొల్లామ్ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ఉద్ఘాటించారు.
నిరాశ్రయులకు 2.96 లక్షల ఇండ్లు
యూడీఎఫ్ పాలన తర్వాత 2016లో రాష్ట్రంలో వామపక్ష ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రజలకు భూమిలేని సమస్యను సవాలుగా స్వీకరించింది. ఆరేండ్లలోనే 2,34,567 కుటుంబాలకు భూమి హక్కు పత్రాలను అందించింది. 2021లో రాష్ట్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిలోనే 54,535 భూమి హక్కు పత్రాలను విజయన్ ప్రభుత్వం లబ్దిదారులకు అందజేసింది. వ్యవసాయ భూమిని కలిగి ఉండి రికార్డుల్లో లేని రైతుల సమస్యనూ పరిష్కరించింది. అలాగే, గత ఆరేండ్లలో గూడులేని వారి కోసం 2,96,008 ఇండ్లను కల్పించింది.
నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించి..
రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయ్యే సందర్భంగా వంద రోజుల ప్రణాళికను విజయన్ ప్రభుత్వం నిర్దేశించుకున్నది. 15 వేల భూపత్రాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అయితే, నిర్దేశిత లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధిగమించింది. 41 వేలకు పైగా ల్యాండ్ టైటిల్ డీడ్స్‌ను అందించి రాష్ట్ర రెవెన్యూ విభాగం విజయం సాధించింది. రాష్ట్ర ప్రభుత్వం తొలి సారిగా కేరళలో డిజిటల్ రీసర్వేను అమలు చేస్తున్నది. దీంతో భూ పంపిణీ సులభం కానున్నది. ఒకసారి సర్వే పూర్తయితే... భూ సంస్కరణల నిబంధనల ప్రకారం నిరుపయోగంగా ఉన్న భూమిని గుర్తించి భూమి లేనివారికి దానిని అందించటం సులభమవుతుందని రెవెన్యూ మంత్రి అన్నారు.