Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏను మళ్లీ తీసుకురావడానికి యత్నాలు
- యూఎన్ ను వేదిక చేసుకుంటున్న మోడీ సర్కారు
- ఇప్పటికే ప్రతిపాదనలు పంపిన ప్రభుత్వం
- వివాదాస్పద సెక్షన్‌ను 2015లోనే కొట్టివేసిన సర్వోన్నత న్యాయస్థానం
న్యూఢిల్లీ : సమాచార సాంకేతిక చట్టం (ఐటీ యాక్ట్), 2000లోని సెక్షన్ 66ఏ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు 2015లో కొట్టివేసింది. అయితే, సదరు వివాదాస్పద చట్టాన్ని ఎలాగైనా తిరిగి తీసుకురావటానికి మోడీ సర్కారు యత్నిస్తున్నది. ఆన్లైన్ ప్రసంగాలపై నియంత్రణ తీసుకురావటం కోసం సదరు సెక్షన్‌ను ఏండేండ్ల తర్వాత అడ్డదారిలో తిరిగి తీసుకురావడానికి పావులు కదుపుతున్నదని నిపుణులు, విశ్లేషకులు తెలిపారు. ఇందుకు ఐక్యరాజ్య సమితి (యూఎన్)ను వేదికగా మలుచుకుంటున్నదని వివరించారు.
'కేంద్రం ప్రతిపాదన సెక్షన్ 66(ఏ)కు నకలు'
సైబర్ క్రైమ్‌ను పరిష్కరించటంలో కొత్త, చట్టబద్ధంగా కట్టుబడి ఉండే యూఎన్ ఒప్పందాన్ని రూపొందించటానికి కొనసాగుతున్న చర్చల సమయంలో.. భారత్ '' ఆక్షేపణీయ సందేశాల నేరపూరితం'' కోసం ఒక ప్రతిపాదనను పంపింది. ఇది సరిగ్గా సెక్షన్ 66ఏకు నకలు అని విశ్లేషకులు తెలిపారు. అయితే, ఈ ప్రతిపాదనపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు స్పందించలేదు. ఈ చర్య వెనక ఉన్న నిగూఢ అర్థాన్ని నిపుణులు, రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. కేంద్రం చేసిన ఆంక్షల ప్రతిపాదనలు ఐక్య రాజ్య సమితిలో ఆమోదం పొందితే దానిని ఆయుధంగా మార్చుకోవాలని మోడీ సర్కారు చూస్తున్నదని వారు చెప్పారు. ఐక్యరాజ్య సమితిలో ఆమోదం పొందినందున 'అంతర్జాతీయ బాధ్యత'గా సెక్షన్ 66ఏను తిరిగి ప్రవేశపెట్టాలని భారత సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్రం నివేదించే అవకాశముంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
న్యాయనిపుణుల్లో ఆందోళన
అయితే, అడ్డదారిలో ఎలాగైనా సెక్షన్ 66ఏను తిరిగి తీసుకురావాలని చూస్తున్న మోడీ సర్కారు తీరుపై న్యాయనిపుణుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతున్నది. బ్యాక్‌డోర్ లెజిస్లేషన్ ద్వారా సెక్షన్ 66ఏను ప్రవేశపెట్టడానికి కేంద్రం ప్రయత్నిస్తుండటం దిగ్భ్రాంతికరమై విషయమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ బి. లోకూర్ అన్నారు. రాజ్యాంగం, న్యాయస్థానాలు ఏమి చెప్పినా.. ప్రభుత్వం అనుకున్నదే చేస్తుందనే సందేశాన్ని సర్వోన్నత న్యాయస్థానం, రాజ్యాంగ న్యాయ నిపుణులు, వాక్ స్వాతంత్య్ర మద్దతుదారులకు కేంద్రం పంపుతున్నదా? అని ఆయన ప్రశ్నించారు.
సైబర్ క్రైమ్‌పై యూఎన్ సమావేశాలు
మే చివరి నుంచి యూఎన్ ద్వారా సమావేశమైన నిపుణుల కమిటీ సైబర్ క్రైమ్‌ను నేరంగా పరిగణించే వివిధ నిబంధనలపై చర్చలు, సమావేశాలను వియన్నాలో జరుపుతున్నది. మే 2021లో ఆమోదించబడి యూఎన్ జనరల్ అసెంబ్లీ (యూఎన్జీఏ) తీర్మానం నిబంధనల ప్రకారం ఏర్పాటైన అడ్‌హక్ కమిటీ ఈ ఏడాది జనవరిలో తన పనిని ప్రారంభించింది. సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి సంబంధించినే ముసాయిదాను 2023-24లోని జనరల్ అసెంబ్లీ 78వ సెషన్‌కు ఇది అందిస్తుంది.
సెక్షన్ 4(డీ)లో భారత్ ప్రతిపాదనలు
సెషన్‌కు ముందు సాధారణ నిబంధనలు, విధానపరమైన చర్యలు, చట్టాన్ని అమలు చేయటం వంటి మూడు నిర్దిష్ట అంశాలపై సూచనలను అందించాలని సభ్యదేశాలను యూఎన్ కోరింది. ఇందుకు స్పందనగా భారత్ గతనెల 12న రాతపూర్వకంగా సూచనలను అందించింది. నేరంగా నిర్దారించగల 13 రకాల అంశాలను ప్రతిపాదించింది. కంప్యూటర్ సిస్టమ్‌లకు నష్టం, సైబర్ ఉగ్రవాదం, పిల్లల అశ్లీలత వంటి వాటిని నిర్వచించటం ఇందులో ఉన్నది. సెక్షన్ 4(డీ) లో భారత్ ఈ ప్రతిపాదనలను పంపింది. అయితే, ఈ సెక్షన్ 4(డీ) అనేది సమాచార సాంకేతిక చట్టం పూర్వపు సెక్షన్ 66ఏ కు ప్రతిరూపమని నిపుణులు తెలిపారు.
ఏమిటీ సెక్షన్ 66ఏ?
సమాచార సాంకేతిక చట్టం, 2000లోని సెక్షన్ 66ఏను 2008లో అప్పటి యూపీఏ-1 ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది రాజకీయ కారణాల కోసం చట్టాన్ని అమలు చేసే సంస్థలచేత దుర్వినియోగం చేయబడిందని పేరుగావించింది. రాజకీయ నాయకులు, కార్టూనిస్టులు, జర్నలిస్టులు, విద్యార్థులు, సామాజిక, పౌర సంఘాల నాయకులు, కార్యకర్తలు ఈ సెక్షన్‌పై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు. ఈ సెక్షన్‌ను ఆయుధంగా మలుచుకొని ప్రభుత్వాలు తమ గొంతును అణచివేసేవని వివరించారు. సెక్షన్ 66ఏ రాజ్యాంగ విరుద్ధంగా అస్పష్టంగా ఉన్నదని 2015లో సుప్రీంకోర్టు భావించింది. ఇది ఆర్టికల్ 19(1)(ఎ)ను పూర్తిగా ఉల్లంఘిస్తోందని అప్పటి న్యాయమూర్తులు జే. చలమేశ్వర్, ఆర్.ఎఫ్. నారీమన్ లతో కూడిన ధర్మాసనం వివరించింది. అదే ఏడాది మార్చి 24న దానిని కొట్టివేస్తూ ఉత్తర్వులు వెలువర్చింది.