Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జులై 18న ఓటింగ్
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) 16వ రాష్ట్రపతి ఎన్నికల కోసం షెడ్యూల్ను గురువారం విడుదల చేసింది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీ కాలం జులై 24తో ముగియనుంది. సీఈసీ రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. 'జులై 25వ తేదీలోగా రాష్ట్రపతిని ఎన్ను కోవాలి. ఎలక్టోరల్ పద్ధతిలో రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ఇక, ఎలక్టోరల్ కాలేజీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉంటారు. నామినేటెడ్ సభ్యులు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కులేదు. కాగా, పార్లమెంట్ ప్రాంగణం, రాష్ట్రాల అసెంబ్లీల్లో ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. రిట్నరింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ వ్యవ హరించనున్నారు' అని తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల కోసం ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. జులై 18న ఎన్నిక జరగనుంది. జులై 21న ఫలితాలు వెల్లడిస్తారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జూన్ 29 కాగా, నామినేషన్ల ఉపసంహరణకు గడువు జులై 2తో ముగుస్తుంది. 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకుంటారు. అసెంబ్లీ ఉండే కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్చేరి ఎమ్మెల్యేలు కూడా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల విలువ మొత్తం 10,98,903 ఉండగా, బీజేపీకి 4,65,797, మిత్రపక్షాలకు 71,329 ఓటు ఉన్నాయి. ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీఎకు 49శాతం ఓట్లు ఉన్నాయి. యూపీఏకు 24.02శాతం, ఇతర పార్టీలకు 26.98శాతం ఓట్లు ఉన్నాయి. ఎలక్టోరల్ కాలేజీలో 778 మంది ఎంపీలు, 4,120 ఎమ్మెల్యేలుంటారు. ఒక్కో ఎంపీ విలువ 700 కాగా, అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో ఎమ్మెల్యే ఓటు విలువ 208గా ఉంది. బ్యాలెట్ విధానంలో రాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది. ఈసారి గిరిజనులకు లేదంటే మహిళలకు రాష్ట్రపతి పదవి దక్కే అవకాశముందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రచారంలోకి మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము, ఛత్తీస్గఢ్ గవర్నర్ అనసూయ, కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, జుయల్ ఓరం పేర్లు వినిపిస్తున్నాయి. తొలిసారిగా రాష్ట్రపతి పీఠంపై గిరిజనులకూ అవకాశం కల్పించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మహిళా కోటాలో తెలంగాణ గవర్నర్ తమిళసై పేరు ప్రచారంలోకి వచ్చింది. ఒకవేళ అగ్రవర్ణాలకు ఇవ్వదలచుకుంటే మాజీ లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్నాథ్ సింగ్ పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మైనార్టీ కోటాలో ముక్తార్ అబ్బాస్ నక్వీ, కేరళ గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పటిదాకా ఆరుగురు ఉపరాష్ట్రపతులకు.. రాష్ట్రపతులుగా అవకాశం దక్కగా.. అదే తరహాలో వెంకయ్య నాయుడుకు అవకాశం దక్కవచ్చన్న ప్రచారమూ నడుస్తోంది.
ఎన్నిక షెడ్యూల్
ఎన్నికలకు నోటిఫికేషన్ జూన్ 15
నామినేషన్ల దాఖలుకు గడువు జూన్ 29
నామినేషన్ల పరిశీలన. జూన్ 30
నామినేషన్ల ఉపసంహరణకు గడువు జులై 2
పోలింగ్ జులై 18
ఓట్ల లెక్కింపు, ఫలితాలు జులై 21