Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజస్థాన్‌లో మూడు స్థానాలు కాంగ్రెస్ వశం
- బీజేపీ బలపరిచిన 'జీ టివి' అధినేత సుభాష్ చంద్ర ఓటమి
- మహారాష్ట్ర, హర్యానాలో కౌంటింగ్ నిలిపివేత
న్యూఢిల్లీ : రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పలేదు. మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, కర్నాటక నాలుగు రాష్ట్రాల్లో 16 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం జరిగిన ఎన్నికల్లో బీజేపీయేతర పక్షాలే పైచేయి సాధించాయి. ప్రత్యేకించి రాజస్థాన్‌లో స్వతంత్ర అభ్యర్థిగా బీజేపీ బరిలో నిలిపిన 'జీ టీవీ' అధినేత సుభాష్ చంద్ర ఘోర పరాజయం పాలయ్యారు. ఇక్కడ మూడు స్థానాలను కాంగ్రెస్ చేజిక్కించుకుంది. ఆ పార్టీ అభ్యర్థులు రణదీప్ సూర్జేవాలా, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారీ ముగ్గురూ ఎన్నికైన్నట్టు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. నాలుగో సీటును బీజేపీకి చెందిన గణశ్యామ్ తివారి గెల్చుకున్నారు. అయితే తగిన సంఖ్యాబలం లేకపోయినా కూడా స్వతంత్ర అభ్యర్థిగా బీజేపీ మద్దతుతో పోటీ చేసి సుభాష్ చంద్ర ఓడిపోయారు.
నాలుగు రాష్ట్రాల్లోనూ ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను నయానోభయానో తనవైపు తిప్పుకునేందుకు బీజేపీ పడరానీ పాట్లూ పడింది. రాజస్థాన్‌లో ఎమ్మెల్యేల కొనుగోలుకు సైతం సిద్ధపడినట్లు వార్తలొచ్చాయి. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కాజేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ ఈ ఎన్నికలకు ఒక రోజు ముందు ఆందోళన వ్యక్తం చేశారు కూడా. ఈ నెల ప్రారంభం నుంచి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను రిసార్ట్స్‌కు తరలించి బీజేపీ కన్నుపడకుండా కాపాడుకున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన పోలింగ్ నాలుగు రాష్ట్రాల్లోనూ అత్యంత ఉత్కంఠ మధ్య కొనసాగింది. రిసార్ట్సు నుంచి ప్రజా ప్రతినిధులను నేరుగా పోలింగ్ కేంద్రానికి తరలించి ఓటు వేసేలా ఆయా పార్టీలు పకడ్బందీ చర్యలు చేపట్టాయి. ఎన్నికల సంఘం కూడా పరిశీలకులను నియమించడంతో పాటు వీడియోగ్రఫీ వంటి ఏర్పాట్లు కూడా చేసింది. దైవార్షికంగా జరిగే ఈ ఎన్నికల్లో మొత్తం 57 ఖాళీలకు గాను 11 రాష్ట్రాల్లో 41 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 16 స్థానాలకు 4 రాష్ట్రాల్లో శుక్రవారం పోలింగ్ నిర్వహించారు. మహారాష్ట్రలో ఆరు, కర్నాటకలో నాలుగు, రాజస్థాన్‌లో నాలుగు, హర్యానాలో రెండు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పోటీ పడినవారిలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పియూష్ గోయల్, కాంగ్రెస్ అభ్యర్థులు రణదీప్ సూర్జేవాలా, జైరాం రమేశ్, ముకుల్ వాస్నిక్, శివసేన తరుపున సంజరు రౌత్ ప్రముఖులు.
మహారాష్ట్ర, హర్యానాలో కౌటింగ్ వాయిదా
మహారాష్ట్ర, హర్యానాలో ఓట్ల లెక్కింపును శుక్రవారం సాయంత్రం వాయిదా వేశారు. బీజేపీ లేవనెత్తిన పలు అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొన్న ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా మహారాష్ట్రలో మహా వికాస్ అఘడి (ఎంవీఏ) కూటమికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల ఓట్లకు సంబంధించి బీజేపీ అభ్యంతరం తెలిపింది. ఎంవీఏ కూడా బీజేపీ ఎమ్మెల్యే సుధీర్ ముంగంటివార్, బీజేపీ అనుబంధ స్వతంత్ర ఎమ్మెల్యే రవి రాణా ఓట్లను చెల్లనివిగా ప్రకటించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేసింది. రాష్ట్ర మంత్రులుగా ఉన్న జితేంద్ర అవ్హాద్ (ఎన్సీపీ), యశోమతి ఠాకుర్ (కాంగ్రెస్), శివసేన ఎమ్మెల్యే సుహాస్ ఖండే ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారనీ, అందువల్ల వారి ఓట్లను పరిగణనలోకి తీసుకోవద్దని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు బీజేపీ తెలిపింది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ నిలిచిపోయింది. ఎన్నికల సంఘం నుంచి అనుమతి వచ్చిన తర్వాతే మళ్లీ కౌంటింగ్ప్రారంభించాల్సివుంటుందని రాజ్యాంగ నిపుణులు తెలిపారు.
మహారాష్ట్రలో ఆరు స్థానాలకు గాను ఏడు గురు అభ్యర్థులు పోటీ చేశారు. రెండు దశాబ్దాల కాలంలో రాజ్యసభ స్థానాల కోసం ఇలా పోటీ పడటం ఇదే తొలిసారి. ప్రధాన పోటీ ఆరో స్థానం కోసం అధికార శివసేన, రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ మధ్యనే సాగింది. బీజేపీ తరపున ధనాంజనేరు మహాధిక్, శివసేన తరపున సంజరు పవార్ మధ్యనే ఈ పోటీ సాగింది.