Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రేసేతర.. లౌకిక అభ్యర్థి ఉండాలని కొన్ని పార్టీల అభిప్రాయం
- రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల వ్యూహం
- ఏచూరి, పవార్, స్టాలిన్, మమతతో సోనియా చర్చలు
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కావడంతో ఉమ్మడి అభ్యర్థి కోసం ప్రతిపక్షాలు కసరత్తు ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రతిపక్ష పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపారు. డీఎంకే అధ్యక్షుడు ఎంకె స్టాలిన్, ఎన్సీపి అధ్యక్షుడు శరద్ పవార్, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీతో సోనియా గాంధీ మాట్లాడినట్టు సంబంధిత వర్గాల తెలిపాయి. ఈ విషయమై ఏకాభిప్రాయం సాధించే బాధ్యతను పార్టీ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు సోనియా అప్పగించారు. ఎన్డీయే యేతర, యూపీఏ యేతర పార్టీల ఆలోచనలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరుంటే బాగుంటుందనేదానిపై వారి అభిప్రాయాలు కోరుతున్నారు.
రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఖర్గే ప్రతిపక్ష ఫ్లోర్ లీడర్లతో బాటు, వైసీపీ, టీఆర్ఎస్, బీజేడీ వంటి యూపీఏ యేతర పార్టీల నేతలను కూడా కలుస్తారు. రాజ్యసభ ఎన్నికల సమన్వయం కోసం ముంబాయిలో ఉన్న ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కలిశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో పాటు డీఎంకే, టీఎంసీ నేతలను కలవనున్నారు. ఈ చర్చల్లో ఉమ్మడి అభ్యర్థి ''కాంగ్రెస్‌యేతర'' వ్యక్తి ఉండాలనే వాదన బలంఆ వినిపించినట్టు తెలిసింది.
2017లో అప్పటి బీహార్ గవర్నర్ రామ్ నాథ్ కోవింద్‌ను బీజేపీ చివరి నిమిషంలో తెరపైకి తెచ్చింది.. దీంతో ప్రతిపక్షాలు తమ వ్యూహాన్ని మార్చుకోవల్సి వచ్చింది. తొలుత ఉమ్మడి అభ్యర్థిగా మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీని దింపాలని భావించాయి. అయితే బిజెపి దళిత వ్యక్తిని రంగంలోకి తీసుకురావడంతో, ఆయనకు పోటీగా దళిత మహిళ మీరా కుమార్‌ను బరిలోకి దింపాయి.