Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సఫాయీ కర్మాచారీ ఆందోళన్ కన్వీనర్ బెజవాడ విల్సన్ డిమాండ్
న్యూఢిల్లీ : దుర్భరమైన, అమానవీయమైన మానవ పాకీ పని (హ్యూమన్ స్కావెంజింగ్)ని దేశంలో పూర్తిగా నిర్మూలించేందుకు గానూ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక సంస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం వుందని సఫాయీ కర్మాచారీ ఆందోళన్ (ఎస్కెఎ) కన్వీనర్, రామన్ మెగసెసె అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్ నొక్కి చెప్పారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా చైతన్యాన్ని తీసుకువచ్చే లక్ష్యంతో 75 రోజుల పాటు సాగే డ్రైవ్‌ను గత నెల్లో ఆరంభించారు. శుక్రవారంతో ఈ డ్రైవ్ చేపట్టి 31రోజులు పూర్తయిన సందర్భంగా విల్సన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పై విషయం స్పష్టం చేశారు. 2016-2020 మధ్య ఈ పాకీ పని కారణంగా 472 మరణాలు నమోదయ్యాయని చెప్పారు. కాలువలు, సెప్టిక్ ట్యాంకులను శుభ్రపరిచే సమయంలో సంభవించే ఈ మరణాలు ఈనాటికీ కొనసాగుతున్నాయన్నారు. ఈ సమస్యను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆయన విమర్శించారు. ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడానికి బదులుగా వాస్తవాలను తిరస్కరిస్తూ, ప్రజలను తప్పుదారి పట్టించేలా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయన్నారు. ఒకదానికొకటి పొంతన లేని ప్రకటనలు చేసేదికూడా వారేనన్నారు. పాకీ పనిచేస్తూ మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని సుప్రీం కోర్టు 2014లో తీర్పు చెప్పినప్పటికీ అమల్లో మాత్రం చాలా రాష్ట్రాల్లో ఒక్క కుటుంబం కూడా ఒక్క రూపాయి నష్టపరిహారాన్ని అందుకోలేదని అన్నారు. తెలంగాణాలో కొంత మేరకు అందుకోగా, తమిళనాడు, పంజాబ్‌ల్లో పరిస్థితులు పర్వాలేదని అన్నారు.