Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నుపూర్ శర్మనుఅరెస్టు చేయాలి : దేశవ్యాప్తంగా ఆందోళనలు
- శుక్రవారం ప్రార్థనల తర్వాత పలు రాష్ట్రాల్లో నిరసన ర్యాలీలు
- పలు చోట్ల నిరసనలు అడ్డుకునేందుకు లాఠీఛార్జ్‌కి దిగిన పోలీసులు
- యూపీలో పోలీసు కాల్పులు..రాంచీలో టియర్‌గ్యాస్ ప్రయోగం..
న్యూఢిల్లీ : మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకుల విద్వేష వ్యాఖ్యలు..నేడు దేశాన్ని రణరంగంగా మార్చాయి. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మతపరమైన ఉద్రిక్తతకు దారితీసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపూర్ శర్మ, నవీన్‌కుమార్ జిందాల్‌ను వెంటనే అరెస్టు చేయాలని జమ్మూకాశ్మీర్, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, జార్ఖాండ్, పంజాబ్, మహారాష్ట్ర, తెలంగాణ, కర్నాటక, పశ్చిమ బెంగాల్..రాష్ట్రాల్లో శుక్రవారం నిరసనలు చోటుచేసుకున్నాయి. జామా మసీద్‌తోపాటు యూపీ, సహరాన్పూర్, మొరాదాబాద్, అహ్మదాబాద్, వడోదరలో, హైదరాబాద్‌లోని మక్కా మసీద్ వద్ద, కోల్‌కతాలోని హౌరా వద్ద ముస్లింలు పెద్ద సంఖ్యలో నిరసన ర్యాలీలు చేపట్టారు. విద్వేష వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకుల్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీలోని జామా మసీద్ వద్ద వేలాది ముస్లింలు కేంద్ర ప్రభుత్వ తీరుపై, బీజేపీ నాయకులపై ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ బహిష్కృత నేతలు నుపూర్ శర్మ, నవీన్‌కుమార్ జిందాల్‌పై కేంద్రం ఎలాంటి చర్య తీసుకోకపోవటంతో ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం ప్రార్థనలు ముగియగానే ఆయా రాష్ట్రాల్లో మసీదుల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యూపీలో పలు చోట్ల నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపినట్టు వార్తలు వెలువడ్డాయి. ఇక జార్ఖండ్‌లోని రాంచీలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులపై టియర్‌గ్యాస్ ప్రయోగించారు.
జామా మసీద్ వద్ద చిన్న పిల్లలతో సహా వేలాదిమంది నుపూర్‌శర్మ, జిందాల్లకు వ్యతిరేకంగా నినాదాలు చేయటం కనిపించింది. అహ్మదాబాద్, వడోదరలో ప్రధాన రోడ్లపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ ముస్లిం యువత నిరసన చేపట్టారు. బీజేపీ నాయకులను అరెస్టు చేయాలని నినాదాలు చేశారు. విద్వేష వ్యాఖ్యలు చేసినవారిపై కఠినమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. శుక్రవార ప్రార్థనల అనంతరం ఢిల్లీ, కోల్‌కతాలలో ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బీజేపీ నుంచి సస్పెండైన నుపూర్ శర్మను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జామా మసీదు షాహీ ఇమామ్ మాట్లాడుతూ, నిరసన కార్యక్రమాలను చేపట్టాలని మసీదు పిలుపునివ్వలేదన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
రాంచీలో
జార్ఖండ్‌లోని రాంచీలో శుక్రవారం ప్రార్థనల అనంతరం ముస్లింలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనకు దిగారు. పోలీసులు బలప్రయోగానికి దిగటంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గాలిలోకి కాల్పులు జరిపి..పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. నిరసనకారులపైకి టియర్‌గ్యాస్ ప్రయోగించారు. ఈనేపథ్యంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మీడియాతో మాట్లాడుతూ, ప్రజలందరూ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. అందరూ సహనంతో ప్రశాంతంగా ఉండాలని సూచించారు.
కోల్‌కతాలో..
హౌరా వద్ద వేలాది మంది ముస్లింలు నమాజ్ అనంతరం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. నుపూర్ శర్మను అరెస్టు చేయాలని ప్లకార్డులు ప్రదర్శించి, నినాదాలు చేశారు. కొంతసేపు రోడ్డును దిగ్బంధనం చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో..
ప్రయాగ్‌రాజ్, మొరాదాబాద్లలో శుక్రవారం ప్రార్థనల అనంతరం ముస్లింలు నిరసన ప్రదర్శన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మొరాదాబాద్‌లో నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ప్రయాగ్‌రాజ్‌లో నిరసన ఉద్రిక్తంగా మారింది. నిరసన ర్యాలీలను అడ్డుకోవాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పోలీసు అధికారులను ఆదేశించారు. దాంతో పలు చోట్ల పోలీసులు కాల్పులు జరిపారని సమాచారం. అల్లర్ల నేపథ్యంలో రాష్ట్రంలో 21మందిని అరెస్టు చేసినట్టు జాతీయ మీడియా కథనాలనుబట్టి తెలుస్తోంది.
జమ్మూకాశ్మీర్‌లో కర్ఫ్యూ
శుక్రవారం జమ్మూకాశ్మీర్‌లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా, జమ్మూ డివిజన్లోని చీనాబ్ లోయలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు శుక్రవారమూ కొనసాగాయి. మహ్మద్ ప్రవక్తపై బీజేపీ తాజా మాజీ నాయకులు నుపూర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్‌లు చేసిన వివాదా స్పద వ్యాఖ్యలపై దోడ, కిష్త్వార్ జిల్లాలో నిరసనలు చెలరేగాయి. దీంతో జమ్మూకాశ్మీర్‌లోని చాలా ప్రాంతాల్లో పోలీసు అధికారులు కర్ఫ్యూను విధించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. దోడాలోని భడెర్వాV్‌ాలో పోలీసులు భద్రతను మరింత తీవ్రతరం చేయడం ఆందోళనకారులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
వివాదాస్పద వ్యాఖ్యలపై కాశ్మీర్ లోయలోని శ్రీనగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో బంద్‌ను పాటించారు. దుకాణాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతబడ్డాయి. వాణిజ్య కేంద్రం లాల్ చౌక్‌తో పాటు ప్రధానమైన మార్కెట్లూ మూతపడటంతో సాధారణ జన జీవనానికి అంతరాయం ఏర్పడింది. స్థానిక ప్రతినిధులు కొందరు నుపుర్ శర్మ, జిందాల్ వ్యాఖ్యలకు సోషల్ మీడియా పోస్టులతో మద్దతు తెలపడంతో చీనాబ్‌లో నిరసనలు చెలరేగిన విషయం విదితమే. దీనికి ఒక్కరోజు తర్వాతే జమ్మూకాశ్మీర్‌లో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకోవటం గమనార్హం. ప్రజలు శాంతిని పాటించాలని కేంద్రపాలిత ప్రాంతంలోని పలు జిల్లాల అధికారులు, సీనియర్ రాజకీయ నాయకులు కోరారు.
చార్మినార్ వద్ద ఉద్రిక్తత
మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకులు నుపుల్ శర్మ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించాయి. ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్, మక్కా మసీద్ వద్ద శుక్రవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వారి వ్యాఖ్యలకు నిరసనగా మక్కా మసీద్‌లో ప్రార్థనల అనంతరం ముస్లిములు యూనాని ఆస్పత్రి వద్ద రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్వేషాలు రెచ్చగొడుతున్న నుపుల్ శర్మను, హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినదించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దక్షిణ మండలం పోలీసులు భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. సిటీ పోలీసు కమిషనర్ సి.వి.ఆనంద్‌తో పాటు పలువురు ఐపీఎస్ అధికారులు చార్మినార్ వద్దకు చేరుకొని శాంతి భద్రతలను స్వయంగా పర్యవేక్షించారు. దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య, చార్మినార్ ఏసీపీ భిక్షం రెడ్డి, హుస్సేనీ ఆలం ఇన్స్పెక్టర్ నరేశ్ కుమార్ తదితరులు మక్కా మసీద్ వద్ద జరిగిన సామూహిక ప్రార్థనలను పరిశీలించడంతో పాటు నిరసనకు దిగిన ముస్లింలను సముదాయించడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా శుక్రవారం మక్కామసీద్‌లో జరిగిన ప్రార్థనలకు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ హుస్సేన్ అమేర్ అబ్దుల్లా కూడా హాజరయ్యారు. ఆయనను కలవడానికి ముస్లిములు అత్యధిక సంఖ్యలో మక్కా మసీదుకు చేరుకున్నారు.