Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐక్య ఉద్యమాలతోనే అరాచక పాలనకు అంతం
- ఎఐఏడబ్ల్యూయూ జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్
న్యూఢిల్లీ:పశ్చిమ బెంగాల్లో అరాచక, ఉన్మాద పాలనతో గ్రామీణ ప్రజలు అతలాకుతలమ వుతున్నారని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్ అన్నారు. శుక్రవారం కోల్‌కతాలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుంటి సాకులు చూపి బెంగాల్‌కు కేంద్ర ప్రభుత్వం ఉపాధి నిధులు నిలిపివేసిందనీ, అవినీతి అక్రమాలను అరికట్టి పేదలకు ఉపాధి కల్పించడంలో రాష్ట్రంలోని టీఎంసీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి బెంగాల్ గ్రామీణ ప్రజల జీవితాలను నట్టేట ముంచుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒకప్పుడు వామపక్ష ప్రభుత్వం పేదలకు భూములు పంచి, గిట్టుబాటు ధర కల్పించి గ్రామీణాభివృద్ధికి, రాష్ట్రం సస్యశ్యామలం కావడానికి దోహదపడిందని, కానీ నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సర్వనాశనం చేసి అరాచక వాతావరణాన్ని సృష్టించాయని విమర్శించారు. స్థానిక సంస్థలకు రాజ్యాంగ బద్ధంగా ఉన్న హక్కులను కల్పించి, ఆదర్శవంతమైన పాలనను అందించి, దేశ ప్రజల మన్ననలు పొందిన బెంగాల్ రాష్ట్రం, ప్రస్తుతం భూస్వాముల దౌర్జన్యాలతో, అరాచక ముఠాల అసాంఘిక పాలనతో సాగుతోందని దుయ్యబట్టారు. దళితులు 25 శాతం, మైనారిటీలు 20 శాతం ఉన్న బెంగాల్లో వారికి గత వామపక్ష ప్రభుత్వం ఇచ్చిన భూములను, ఇప్పటి తృణముల్ ప్రభుత్వం అండతో భూస్వామ్య గూండాలు బలవంతంగా లాగేసుకుంటున్నారని విమర్శించారు. పేదలకు అండగా ఉండాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అరాచక శక్తులకు అండగా నిలిచిందని అన్నారు. పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీజేపీ మతోన్మాద చర్యలని రెచ్చగొడు తోందని, ఈ స్థితిలో అందరికీ ఉపాధి, భూమి, ఇల్లు, విద్య, వైద్యం సామాజిక న్యాయం సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలకు సిద్ధం అవుతున్నామని అన్నారు. జులైలో నెలరోజుల పాటు గ్రామగ్రామాన వ్యవసాయ కార్మిక సంఘం నాయకత్వంలో బృందాలు వ్యవసాయ కార్మికులను సమైక్యం చేసేందుకు కృషి చేస్తాయని తెలిపారు. జులై 20 నుంచి 24 వరకు నాలుగు రోజులపాటు రోడ్డు దిగ్బంధం, ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి లాంటి సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. ఆగస్టు 1న అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు మహా ధర్నా నిర్వహించాలని అన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సంఘం జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. సంఘం ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా ఈ మహా సభలు బెంగాల్లో జరుగుతున్నాయని తెలిపారు. ఈ మహాసభల్లో స్థానిక సమస్యల మీద సమరశీల ఉద్యమాలకు ప్రణాళిక రూపొందిస్తామని అన్నారు. సమావేశంలో బెంగాల్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర, అధ్యక్ష కార్యదర్శులు తుషార్ ఘోష్, అమియా పాత్ర, సీనియర్ నాయకులు మదన్ ఘోష్ తదితరులు పాల్గొన్నారు.