Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నుపుర్, నవీన్ జిందాల్‌లపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలి
- రాంచీ, హౌరా, ఇతర ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలపై సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో తీవ్ర ఆందోళన
న్యూఢిల్లీ : రాంచీ, హౌరా, ఇతర ప్రాంతాల్లో చెలరేగిన హింసాత్మక ఘటనలపై సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో స్పందించింది. ఈ ఘటనలపై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. మహ్మద్ ప్రవక్తపై బీజేపీ తాజా మాజీ నాయకులు నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ల వివాదాస్పద వ్యాఖ్యలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో భాగంగా రాంచీ, హౌరా, ఇతర ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న విషయం విదితమే. ఇటువంటి రెచ్చగొట్టే, అవమానకరమైన వ్యాఖ్యలపై ఆగ్రహం సమర్థించదగినదే అయినప్పటికీ.. ఏదైనా హింసాత్మక నిరసన మత శక్తుల చేతుల్లోకి వెళ్లి పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో పేర్కొన్నది. ప్రజలు శాంతిని పాటించాలని కోరింది. ఇద్దరు బీజేపీ మాజీ నేతలనే కాకుండా 30 మంది పేర్లను చేరుస్తూ ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేయటం దురదృష్టకరమనీ, ఇందులో కేసుతో సంబంధం లేని ఒక జర్నలిస్టు పేరూ ఉన్నదని పొలిట్ బ్యూరో ఆందోళనను వ్యక్తం చేసింది. బీజేపీ నాయకులు చేసిన నేర తీవ్రతను తగ్గించటంలో భాగంగా ఇది దృష్టి మరల్చే చర్య అని ఆరోపించింది. నిర్దిష్ట నేరానికి సంబంధించి ఇద్దరు మాజీ అధికార ప్రతినిధులపై వేర్వేరుగా చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది.