Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి దశలో 14వేల కుటుంబాలకు
- జూన్ నెలాఖరుకు అందుబాటులోకి సేవలు
తిరువనంతపురం : కేరళలో దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్) ఉన్న కుటుంబాలకు త్వరలో ఉచిత ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 20 లక్షల బీపీఎల్ కుటుంబాలకు ఉచిత ఇంటర్నెట్ సేవలు కల్పించాలన్న లక్ష్యంతో కేరళ ప్రభుత్వం రూ. 1548 కోట్లతో ప్రతిష్టాత్మక కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ (కే-ఎఫ్ఓఎన్)ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి దశలో 14 వేల బీపీఎల్ కుటుంబాలు లబ్ది పొందనున్నాయి. ప్రాజెక్టు మొదటి దశ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. దీంతో ఈ నెల చివరి నాటికి వారికి ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఐఎస్పీ లైసెన్సు అందటమే తరువాయి
టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్ (ఐఎస్పీ) లైసెన్సు పొందిన తర్వాత ఈ ప్రాజెక్టు జూన్ చివరినాటికి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాజెక్టు ఐఎస్పీ లైసెన్సు ఒక వారం లోగా అందొచ్చని కే-ఎఫ్ఓఎన్ మేనేజింగ్ డైరెక్టర్ సంతోశ్ బాబు అన్నారు. కాగా, ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ ప్రాజెక్టు ఇలా ఇండ్లకు మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వాస్పత్రులు వంటి అన్ని ప్రభుత్వ సంస్థలను కలుపుతుంది. అంచనా వేసిన 30 వేల సంస్థలలో 23,091 ఇప్పటికే కే-ఎఫ్ఓఎన్ హై-స్పీడ్ కనెక్టివిటీ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి.
నియోజకవర్గానికి వంద చొప్పున బీపీఎల్ కుటుంబాల ఎంపిక
ప్రాజెక్టు తొలి దశలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 140 నియోజకవర్గాల్లోని వంద చొప్పున బీపీఎల్ కుటుంబాలను లబ్దిదారులుగా ఎంపిక చేస్తారు. ఈ కుటుంబాలకు 50 ఎంబీపీఎస్ స్పీడు కలిగిన 1.5 జీబీ ఉచిత డేటా అందుతుంది. డేటా పరిమితి ముగిసిన తర్వాత సబ్సీడీ రేట్లు వర్తిస్తాయి. డిజిటల్ విభజనను తొలగించటంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 20 లక్షల బీపీఎల్ కుటుంబాలకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించటంలో భాగంగా విజయన్ సర్కారు ఈ ప్రాజెక్టును తీసుకొచ్చింది. కేరళను నాలెడ్జ్ ఎకానమిగా మార్చే వామపక్ష ప్రభుత్వ విజన్లో కే-ఎఫ్ఓఎన్ ఒక భాగం. వేగవంతమైన ఇంటర్నెట్ను చౌక ధరలకు తీసుకొచ్చి డిజిటల్ సెక్టార్లో ఉద్యోగాలను సృష్టించటమే కేరళ సర్కారు లక్ష్యంగా పెట్టుకున్నది. 2019లో ఇంటర్నెట్ను ప్రాథమిక హక్కుగా గుర్తించిన తొలి రాష్ట్రంగా కేరళ నిలిచిన విషయం విదితమే.