Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరు బ్యాంకులు లబోదిబో
- లండన్ కోర్టును ఆశ్రయించిన సంస్థలు
న్యూఢిల్లీ : జీవీకే గ్రూపులో భాగమైన జీవీకే కోల్ డెవలపర్స్ సంస్థ పలు బ్యాంకులకు రూ.12,114 కోట్లు (1.5 బిలియన్ డాలర్లు) ఎగనామం పెట్టింది. ఆయా బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించలేదు. దాదాపు 11 ఏండ్ల క్రితం తీసుకున్న అప్పులను రాబట్టుకోలేక ఆయా బ్యాంక్‌లు ఇప్పుడు లబోదిబో మంటున్నాయి. అసలుతో పాటు వడ్డీ చెల్లించాలని ఆరు బ్యాంకులు తాజాగా లండన్ హైకోర్టును ఆశ్రయించాయి. అప్పులిచ్చిన భారత బ్యాంకుల్లో కెనరా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులున్నాయని టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనం వెలువరించింది. ఈ విత్త సంస్థలు 2011లో ఒక్క బిలియన్ డాలర్లు (దాదాపు రూ.7600 కోట్లు) రుణం, రూ.273 కోట్లు లెటర్ ఆఫ్ క్రెడిట్ రూపంలో అందించాయి. ఐదు బ్యాంక్‌లు 2014లో మరోసారి రూ.1,250 కోట్లు అప్పుగా ఇచ్చాయి. ఈ అప్పులన్నిటీని చెల్లించడంలో సింగపూర్ కేంద్రంగా ఏర్పాటు చేసిన జీవీకే కోల్ డెవలపర్స్ సంస్థ విఫలమయ్యింది. రుణాలు పొందే సమయంలో జీవీకే గ్రూపులోని ఇతర తొమ్మిది సంస్థలు గ్యారంటీగా ఉన్నాయి. ఇందులోనూ ఏడు సంస్థలు సింగపూర్ కేంద్రంగా పని చేస్తుండగా.. మరో రెండు సంస్థలు సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్నాయి. ఈ కేసు సోమవారం విచారణకు రానుందని సమాచారం. ఈ అప్పులపై ఆ కంపెనీ స్పందించడానికి నిరాకరించింది. ఈ రుణాలతో జీవీకే గ్రూపు ఆస్ట్రేలియా క్వీన్స్‌లాండ్‌లో అల్పా ప్రాజెక్టు గనులను లీజుకు తీసుకుంది. బొగ్గు రంగం మార్కెట్లో ఒడిదుడుకులు, థర్డ్ పార్టీ పెట్టుబడుల్లో సమస్యలు, ఈ ప్రాజెక్టుపై క్వీన్స్లాండ్ కోర్టులో న్యాయ సమస్యల కేసులు తదితర అంశాలతో ఈ ప్రాజెక్టులో స్వల్ప పురోగతి మాత్రమే చోటు చేసుకుందని సమాచారం. గనుల లీజు సమయంలో పర్యావరణ సంస్థల నుంచి సమస్యలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో తిరిగి అప్పులు చెల్లించలేదు. ఇచ్చిన రుణాలు తిరిగి చెల్లించాలని 2020 నవంబర్‌లో బ్యాంక్‌లకు జీవీకేను ఆదేశించాయి. జీవీకే లేదా గ్యారంటీ ఇచ్చిన సంస్థలు రుణాలు చెల్లించకపోతే చర్యలు తప్పవని నోటీసుల్లో పేర్కొన్నాయి. కాగా.. దేశంలో రైతులు, మధ్య తరగతి వారికి వేలు, లక్షల్లో అప్పులిస్తేనే ఆరు నెలలు కూడా ఆగనివ్వని బ్యాంక్‌లు.. కార్పొరేట్ కంపెనీలకు మాత్రం 10 -15 ఏండ్ల సమయం ఇవ్వడం గమనార్హం.