Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీ సీఎం మీడియా సలహాదారు బుల్డోజర్ వార్నింగ్
- ప్రతి శుక్రవారం తర్వాత శనివారం వస్తుందంటూ పరోక్ష హెచ్చరికలు
లక్నో : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మీడియా సలహాదారు మృంత్యుంజరు కుమార్ ట్విట్టర్ వేదికగా నిరసనకారులకు 'బుల్డోజర్ వార్నింగ్'ను పంపారు. '' గుర్తుంచుకోండి, ప్రతి శుక్రవారం తర్వాత శనివారం వస్తుంది'' అని హిందీలో రాసుకొచ్చారు. నిర్మాణాలను కూలగొడుతున్న బుల్డోజర్ల ఫోటోను ఈ కామెంట్‌కు ఆయన జత చేశారు. మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకులు నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ల వివాదాస్పద వ్యాఖ్యలకు వ్యతిరేకంగా శుక్రవారం నాడు జార్ఖండ్‌లోని రాంచీ, పశ్చిమ బెంగాల్‌లోని హౌరా, జమ్మూకాశ్మీర్, యూపీలోని ప్రయాగ్‌రాజ్‌తో పాటు పలు ప్రాంతాలలో నిరసనలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇలాంటి ఆందోళనల్లో పాల్గొన్న నిరసనకారులకు హెచ్చరికలు పంపే ఉద్దేశంతోనే సీఎం మీడియా సలహాదారు ఆ ట్వీట్ చేశారని విశ్లేషకులు తెలిపారు.
'శనివారంను బుల్డోజర్ డే గా ప్రకటించాలి'
ఇటు సోషల్ మీడియాలో ఇతర బీజేపీ నాయకుల పోస్టులూ అగ్నికి ఆజ్యం పోసేలా ఉన్నాయి. హర్యానా బీజేపీ ఐటీ బాధ్యులు అరుణ్ యాదవ్ ఇదే తరహాలో ట్వీట్ చేశారు. '' ఇప్పుడు శుక్రవారం స్టోన్-డే. శనివారం ను 'బుల్డోజర్ డే' గా ప్రకటించాలి'' అని ఆ ట్వీట్లో రాసుకొచ్చారు. అలాగే, బీజేపీ అనుకూల మీడియా కూడా ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుంటూ నిరసనలపై చర్చలు పెట్టాయి. సోషల్ మీడియా పేజీలు, హిందూత్వ శక్తుల మద్దతుదారులూ సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులను వైరల్ చేశారు. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుంటూ ద్వేశపూరిత, వ్యంగ్యాత్మక కామెంట్లను పెట్టటం కనిపించింది.
యూపీలో శుక్రవారం భారీ హింసాత్మక నిరసనలు చెలరేగిన నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని శనివారం ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు నగరాల్లో నిరసనలతో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టిన సంఘ విద్రోహ శక్తులపై కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు.