Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్కు సీపీఐ(ఎం) ఎంపీ వి శివదాసన్ లేఖ
న్యూఢిల్లీ : ఉపాధి హామీ బకాయిలను రాష్ట్రాలకు వెంటనే విడుదల చేయాలని సీపీఐ(ఎం) రాజ్యసభ ఎంపీ వి.శివదాసన్ కోరారు. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్కు ఆయన లేఖ రాశారు. ఉపాధి, ఆర్థిక వ్యవస్థలో తీవ్రమైన సంక్షోభ సమయంలో ఉపాధి హామీ బకాయిలు రాష్ట్రాలకు చెల్లించకపోవడం చాలా ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉన్న సమయంలో, ద్రవ్యోల్బణం కారణంగా గ్రామీణ భారతదేశం కష్టాల్లో ఉన్న సమయంలో ఉపాధి హామీ వంటి పథకాలు సమర్థవంతంగా పనిచేయడమనేది బహుజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి చాలా అవసరమని తెలిపారు. అయితే మెటీరియల్ ఖర్చులు చెల్లించకుండా ఒక్క కేరళకే కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.700 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. దీంతో ఉపాధి హామీ పథకం సమర్థవంతంగా పనిచేయడానికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.
కేంద్ర బడ్జెట్లోనే 2022-23 బడ్జెట్లో రూ. 73,000 కోట్ల తక్కువ కేటాయింపులు జరిగాయని, ఇది గతేడాది సవరించిన అంచనాల రూ.98,000 కోట్ల కంటే తక్కువని తెలిపారు. కేరళకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి (ఎంజీఎన్ఆర్ఇజీఎస్) లేబర్ బడ్జెట్ కేటాయింపులను గతేడాదితో పోలిస్తే కేంద్ర ప్రభుత్వం గణనీయంగా తగ్గించడం చాలా ఆందోళన కలిగించే విషయమని అన్నారు. రాష్ట్రానికి ఈ ఏడాది 6.5 కోట్ల పనిదినాలు మాత్రమే కేటాయించగా, అంతకుముందు ఏడాది 10.59 కోట్ల పనిదినాలు ఉన్నాయని తెలిపారు. సెప్టెంబరు నుంచి కేరళలో ఉపాధి హామీ పనుల కింద జరిగిన మెటీరియల్ ఖర్చులను కేంద్ర ప్రభుత్వం చెల్లించలేదని అన్నారు.
కేరళలోని ఒక్క కన్నూర్ జిల్లాలోనే రూ.65.58 కోట్లు పెండింగ్లో ఉన్నాయని, సెప్టెంబర్ 2021 నుండి ఎలాంటి చెల్లింపులు చేయలేదని అన్నారు. ఇంత సుదీర్ఘ జాప్యం గతంలో ఎన్నడూ లేదని తెలిపారు. మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా వెరిఫికేషన్ అనే కొత్త వ్యవస్థల వల్ల చాలా రాష్ట్రాల్లో వేతన చెల్లింపులు జాప్యం జరుగుతుందని అన్నారు. బకాయిల చెల్లింపులో జాప్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు.