Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సూపర్ రిచ్‌కు కలిసివచ్చిన మోడీ సర్కార్ ఆర్థిక విధానాలు
- 2021-22లో లాభాలు రూ.9.3లక్షల కోట్లు : సీఎంఐఈ తాజా నివేదిక
కరోనా సంక్షోభంలో దేశం యావత్తు కొట్టుమిట్టాడుతుంటే..బడా కార్పొరేట్లు, అత్యంత ధనికులు వేల కోట్ల రూపాయల లాభాలు పోగేసుకున్నారని పలు అధ్యయనాలు వెల్లడించాయి. అది అక్షరాలా నిజమని 'సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ' తాజాగా గణాంకాల్ని విడుదల చేసింది. కరోనా మహమ్మారి ప్రబలిన 2020-21లో బడా కార్పొరేట్ కంపెనీల లాభం రూ.5.5లక్షల కోట్లు, 2021-22లో రూ.9.3లక్షల కోట్లుగా ఉందని సీఎంఐఈ తెలిపింది. సూపర్ రిచ్ (అత్యంత ధనికులు, కార్పొరేట్లు)కు అనుకూలించే మోడీ సర్కార్ ఆర్థిక విధానాల ఫలితమిదని వివరించింది. కరోనా టైంలో..84శాతం కుటుంబాల ఆదాయం పడిపోయిందని పలు నివేదికలు పేర్కొన్నాయి. కానీ అదే కరోనా టైంలో..మనదేశంలోని బడా కార్పొరేట్లు, ధనికుల ఆర్జన లక్షల కోట్లు దాటింది.
- అదే టైంలో..సామాన్యుడి నడ్డి విరిచిన లాక్డౌన్, కఠిన ఆంక్షలు
- ఓవైపు దేశంలో 84శాతం కుటుంబాల ఆదాయం గల్లంతు..మరోవైపు ధనికులకు కోట్లలో లాభాలు
- 3288 కంపెనీల ఫైనాన్షియల్ స్టేట్మేంట్స్ ఆధారంగా గణాంకాలు విడుదల
న్యూఢిల్లీ : మనదేశంలో ఎన్నో కుటుంబాలు తినేందుకు తిండిలేక, ఉపాధిలేక నానా అవస్థ పడుతున్నాయి. మరోవైపు బడా కార్పొరేట్లు, ధనికులు అత్యంత సులభంగా వేల కోట్ల లాభాలు ఆర్జిస్తున్నారు. కేంద్రంలో మోడీ సర్కార్ ఆర్థిక విధానాల ఫలితమిదని 'సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ' (సీఎంఐఈ) తాజా నివేదిక వెల్లడించింది. కరోనా ఆంక్షలు, లాక్డౌన్ నిబంధనలు బడా కార్పొరేట్లకు, అత్యంత ధనికులకూ వర్తిస్తాయి కదా! మరి వారి ఆదాయాలు ఎందుకు పడిపోలేదన్న ప్రశ్న ఇక్కడ ఉదయిస్తోంది. కరోనాకు ముందు నాటితో పోల్చితే సంక్షోభ సమయంలో (గత రెండేండ్లుగా) సూపర్ రిచ్ మూడు రెట్లు లాభాలు ఆర్జించింది.
కరోనాకు ముందు ఏడాది 2019-20లో దేశంలోని 3288 బడా కార్పొరేట్ కంపెనీల లాభాలు రూ.2.3లక్షల కోట్లు. కరోనా సంభవించిన 2020-21లో రూ.5.5లక్షల కోట్లు. అటు తర్వాత ఏడాది 2021-22లో లాభాలు పోగేసుకోవటం రూ.9.3లక్షల కోట్లకు పెరిగింది. బాంబే స్టాక్ మార్కెట్లో 3288 లిస్టెడ్ కంపెనీలు అధికారికంగా విడుదల చేసిన సమాచారం (ఫైనాన్షియల్ స్టేట్మేంట్స్) ఆధారంగా సీఎంఐఈ పై గణాంకాల్ని విడుదల చేసింది. ఇంతపెద్ద మొత్తంలో ఆ కంపెనీలు లాభాలు ఎలా పోగేసుకున్నాయన్న అంశాన్ని నివేదికలో వివరించింది. దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగాయని, మరోవైపు బడా కంపెనీలు వేల కోట్ల లాభాలు ఆర్జిస్తున్నాయన్న వాదన నిజమేనని నివేదికలో పరిశోధకులు వ్యక్తం చేశారు.
వడ్డించేది మనవాడే..
ప్రధానిగా మోడీ అధికారంలోకి వచ్చింది మొదలు 2014 నుంచి బడా కార్పొరేట్ వర్గంపై వరాల జల్లు కురుస్తోంది. కార్పొరేట్ పన్ను తగ్గింపు కాకుండా, ఆయా కంపెనీలకు రూ.6.15లక్షల కోట్లు (కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పత్రాల ఆధారంగా) విలువజేసే వివిధ రకాల మినహాయింపులు, రిబెట్లు, ఇతర ప్రయోజనాలు కేంద్రం ఇచ్చింది. లెక్క ప్రకారం ప్రభుత్వ ఖజనాలో జమ కావాల్సిన రెవెన్యూ ఆదాయం ఇది. ఇదిలా ఉండగా ప్రభుత్వ బ్యాంకుల నుంచి కార్పొరేట్లు తీసుకున్న దాదాపు రూ.10.72లక్షల కోట్ల రుణాల్ని మోడీ సర్కార్ రైట్ ఆఫ్ చేసింది. ఇందులో కరోనాను సాకుగా చూపి 2020-21లో రూ.2.03లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేసింది. దీనికి తోడు దేశంలో లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. దాంతో నేడు కార్మికులు, ఉద్యోగులు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రతకు దూరమయ్యారు. ఇదంతా కూడా దేశంలో ఉపాధి పడిపోవడానికి దారితీసిందని, ఆర్థిక అసమానతలను తీవ్రరూపం చేసిందని నిపుణులు చెబుతున్నారు.
ఆక్స్‌ఫాం..కూడా ఇదే చెప్పింది..
మనదేశంలో మునుపెన్నడూ లేనంతగా ఆర్థిక అసమానతలు పెరిగాయని ఆక్స్‌ఫాం ఇండియా ఈ ఏడాది మొదట్లో కీలక నివేదిక విడుదల చేసింది. ముఖ్యంగా కరోనా సంక్షోభ సమయంలో దేశంలోని 84శాతం కుటుంబాల ఆదాయాలు పడిపోయాయ ని, మరోవైపు శతకోటీశ్వరుల సంఖ్య 102 నుంచి 142పెరిగిందని ఆక్స్‌ఫాం వెల్లడించింది. వీరి సంపద రూ.23.14లక్షల కోట్ల (కరోనా సమయం లో) నుంచి రూ.53.16లక్షల కోట్లకు పెరిగింది. ఇదే కరోనా సమయంలో 4.6కోట్ల మంది భారతీయులు తీవ్రమైన పేదరికంలోకి కూరుకుపోయారు. మోడీ సర్కార్ ఎంచుకున్న ఆర్థిక విధానాల వల్లే దేశంలో ఈస్థాయిలో ఆర్థిక అసమానతలు నెలకొన్నాయని ఆక్స్‌ఫాం నివేదిక అభిప్రాయపడింది. ఈ నివేదికలోని గణాంకాలు, ఇప్పుడు తమకు లభించిన గణాంకాలు ఒకే విధంగా ఉన్నాయని సీఎంఐఈ పేర్కొన్నది. ఏదేమైనా కరోనా సంక్షోభం కార్పొరేట్‌కు భారీ లాభాల్ని తెచ్చిపెట్టిందన్నది వాస్తవం.
ఎందుకిలా?
ముడి సరుకుల ధరలు పెరిగాయని అనేక కంపెనీలు తమ ఉత్పత్తుల ధరల్ని విపరీతంగా పెంచేశాయి. ఏడాదికి సగటున ముడి సరుకుల ధరలు 40.1శాతం పెరగగా, విద్యుత్, ఇంధన ధరలు మరింత పెరిగాయి. ఈనేపథ్యంలో 47శాతం వస్తువుల ధరలు 30శాతానికిపైగా పెరిగాయి. కంపెనీల నిర్వహణ ఖర్చు మాత్రం పెరగలేదు. కారణం ఎక్కడా కూడా కార్మికులకు, ఉద్యోగులకు కంపెనీలు వేతనాలు పెంచలేదు. అనేకమందిని ఉద్యోగాల నుంచి తొలగించి వేతనాల బిల్లును తగ్గించుకున్నాయి. అందువల్లే బడా కంపెనీలు లాభాలు నమోదుచేశాయి. కరోనా పరిస్థితులు మెరుగుపడినా...తొలగించిన కార్మికుల స్థానంలో మళ్లీ నియామకాలు జరుపలేదు. చాలా స్వల్ప వేతనాలతో కొత్త నియామకాలు చేపట్టాయి. కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
- మోడీ సర్కార్ ప్రకటించిన పన్ను ప్రయోజనాలు, రిబెట్లు, మినహాయింపులు బడా కార్పొరేట్‌కు వరంలా మారాయి.
- ఆయా కంపెనీలకు ప్రభుత్వ బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు దక్కుతున్నాయి. వీటిపై వడ్డీని తగ్గిస్తూ..రుణ పునర్వ్యవస్థీకరణ ప్యాకేజీలు కూడా ఇస్తోంది.
- 2019లో కార్పొరేట్ పన్నును 30శాతం నుంచి 22శాతానికి కేంద్రం తగ్గించింది. కంపెనీల వేల కోట్ల లాభాలకు ఇది ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
- కార్పొరేట్ పన్ను తగ్గింపు ద్వారా కేంద్ర ఖజానాకు రూ.1.45లక్షల కోట్ల పన్ను ఆదాయం రాకుండా పోయింది.
- ఉపాధిరంగం మెరుగుపడుతుందని, ఉద్యోగాలు వస్తాయని, కొనుగోలు డిమాండ్ పెరుగుతుందని..మొత్తంగా ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని తన చర్యని కేంద్రం సమర్థించుకుంది.
- కానీ..మూడేండ్ల తర్వాత అదంతా అబద్ధమని తేలిపోయింది. పన్ను ప్రయోజనాలతో కార్పొరేట్లు భారీ లాభాలు మూటగట్టుకున్నాయని తేలింది.