Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆమె ముఖంపై 118 కుట్లు
భోపాల్: మధ్యప్రదేశ్‌లో మహిళలపై దురాగతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పట్టపగలు ఒక మహిళపై కొందరు ఈవ్ టీజింగ్‌కు పాల్పడటంతో ఆమె తీవ్రంగా గాయపడింది. పేపర్ కట్టర్‌తో ఆమె ముఖంపై దాడి చేయడంతో 118 కుట్లు పడ్డాయి. ముఖం అంతా గాయాల కారణంగా ఛిద్రమైంది. భోపాల్‌లోని టీటీనగర్లో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ మహిళ టీటీ నగర్‌లోని రోషన్‌పురలో ఉన్న శ్రీ ప్యాలెస్ హౌటల్‌కు శుక్రవారం తన భర్తతో కలిసి వెళ్లింది. బైక్ పార్కింగ్ విషయంలో ఆమెకు, ఒక వ్యక్తికి చిన్న గొడవ తలెత్తింది. ఆ తర్వాత ఆ వ్యక్తికి మద్దతుగా మరో ఇద్దరు అక్కడికి చేరుకున్నారు. ఆమెను చూసి విజిల్ వేయడమే కాకుండా నిందితుడు అసభ్యంగా మాట్లాడటంతో గొడవ మొదలైంది. ఆ సమయంలో ఆమె భర్త హౌటల్లో ఉన్నాడు. ఆ మహిళకు, ఆ ముగ్గురికి మధ్య జరిగిన గొడవలో ముగ్గురిలో ఒకరిని ఆమె చెంప దెబ్బ కొట్టింది. ఆ తర్వాత హౌటల్‌లోకి వెళ్లి భర్తతో కలిసి ఉంది. హౌటల్ నుంచి ఆ భార్యాభర్తలు బయటికొచ్చిన సమయంలో ఆ మహిళపై పేపర్ కట్టర్‌తో నిందితుడు దాడి చేశాడు. అడ్డుకోబోయిన ఆమె భర్తను మిగిలిన ఇద్దరూ పక్కకు లాగేశారు. నిందితుడు కోపంతో ఆ మహిళ ముఖంపై అదే పనిగా దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆ తర్వాత ముగ్గురూ అక్కడి నుంచి పారిపోయారు. ఆ మహిళను ఆమె భర్త ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ఆ మహిళకు సర్జరీ చేస్తే.. బాధితురాలి ముఖంపై 118 కుట్లు పడ్డాయి. ముగ్గురు నిందితుల్లో పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరొకరి కోసం వెతుకులాట సాగిస్తున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో సంచలనంగా మారడంతో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా బాధితురాలి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆమె చికిత్సకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని ఆమెకు, ఆమె భర్తకు హామీ ఇచ్చారు.