Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజపక్సేపై ప్రధాని మోడీ ఒత్తిడి
- శ్రీలంక ఎలక్ట్రిసిటీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ : ప్రపంచ సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్న అదానీ, అంబానీల ప్రయోజనాల కోసం మోడీ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నది. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ వారికి లబ్ది చేకూరేలా అక్కడి ప్రభుత్వాలపై ఒత్తిళ్లు తెస్తున్నది. వీరి తరఫున భారత ప్రధాని హోదాలో మోడీ వ్యక్తిగతంగా పనులను చక్కబెడుతుండటం గమనార్హం. ఇందుకు శ్రీలంక ఎలక్ట్రిసిటీ బోర్డు వెల్లడించిన సంచలన విషయాలే నిదర్శనం.
శ్రీలంకలోని మన్నార్‌లో 500 వందల మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజక్టును నేరుగా అంబానీ గ్రూపునకు కట్టబెట్టాలని భారత ప్రధాని మోడీ పట్టుబట్టినట్టు శ్రీలంక అధ్యక్షులు గొటబాయ రాజపక్సే తనకు చెప్పారని శ్రీలంక ఎలక్ట్రిసిటీ చీఫ్ తెలిపారు. ఈ మేరకు ఆ దేశ పార్లమెంటరీ ప్యానెల్ ముందు తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. అయితే, దీనిని రాజపక్సే తోసిపుచ్చుతూ తర్వాతి రోజు ట్వీట్ చేశారు.
వాంగ్మూలంపై రెండు రోజులకే యూటర్న్
ఇటు ఎలక్ట్రిసిటీ చీఫ్ కూడా వాంగ్మూలం ఇచ్చిన రెండు రోజుల తర్వాత తన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్నారు. తాను ఊహించని ఒత్తిళ్లు, భావోద్వేగం కారణంగా తానబద్ధం చెప్పినట్టు తెలపటం గమనార్హం. తన ప్రకటనను వెనక్కి తీసుకున్నాని ఒక వార్త సంస్థకు తెలిపారు. క్షమాపణను తెలుపుతూ ఒక ప్రకటననూ విడుదల చేశారు. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ పార్లమెంటరీ ప్యానెల్ ముందు సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు (సీఈబీ) చైర్మెన్ ఎం.ఎం.సీ. ఫెర్డినాండో బహిరంగంగానే తన వాంగ్మూలాన్ని ఇచ్చాడు. ఈ వాంగ్మూలానికి సంబంధించిన వీడియో క్లిప్‌ను శ్రీలంక వార్త చానెళ్లు సైతం అప్లోడ్ చేశాయి. దీంతో తన వ్యాఖ్యలపై ఫెర్డినాండో యూటర్న్ తీసుకోవటం అనుమానాలకు తావిస్తున్నదని విశ్లేషకులు తెలిపారు.
శ్రీలంక ప్రధాన ప్రతిపక్షం ఆగ్రహం కాగా, బిడ్డింగ్ పోటీని నివారించేందుకు శ్రీలంక ఎలక్ట్రిసిటీ యాక్ట్, 1989కి ఆ దేశ పార్లమెంటు సవరణ తీసుకొచ్చింది. ఈ సవరణ చేసిన తర్వాతి రోజే శ్రీలంక ఎలక్ట్రిసిటీ చీఫ్ వాంగ్మూలం ఇచ్చారు. ఇటు ఈ సవరణ అదానీ డీల్ కోసమేనని ఆ దేశ ప్రధాన ప్రతిపక్షం సమాగి జన బలవెగయ (ఎస్‌జేబీ) ఆరోపించింది. గౌతమ్ అదానీ గతేడాది అక్టోబర్‌లో శ్రీలంకలో పర్యటించారు ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే, ప్రధాని మహీంద రాజపక్సేలతో సమావేశమైన ఫోటోలతో కూడిన ట్వీట్లను సైతం ఆయన చేశారు.
శ్రీలంకకు ఆర్థిక సాయంలో మర్మమేంటి?
ప్రస్తుతం శ్రీలంక గతంలో ఎన్నడూ లేని తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నది. ఈ నేపథ్యంలో మోడీ ప్రభుత్వం ఆ దేశానికి ఇంధన, ఆహార అవసరాలను తీర్చే సహాయాన్ని అందిస్తున్నది. అత్యవసర వస్తువుల కొనుగోలు కోసం ఆ దేశానికి భారత్ ఇప్పటి వరకు దాదాపు 3.5 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని అందించింది. మరోపక్క, దేశంలో ఆర్థిక సంక్షోభానికి కారణం శ్రీలంకలో రాజపక్సే కుటుంబ పాలనే అని అక్కడి దేశ ప్రజలు వారిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అయితే, ఈ నేపథ్యంలో శ్రీలంకకు భారత సాయం వెనక మర్మమేమైనా ఉన్నదా? అని విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.