Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విమానంలో యూత్ కాంగ్రెస్ దుశ్చర్య
- ఇద్దరిని అదుపులోకి తీసుకున్న సీఐఎస్ఎఫ్
తిరువనంతపురం : కేరళ సీఎం పినరయి విజయన్‌పై యూత్ కాంగ్రెస్ దుశ్చర్యకు దిగింది. విమానంలోనే ఆయనపై దాడికి దిగటానికి యత్నించింది. ఈ ఘటనకు కారణమైన యూత్ కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు నేతలు ఫర్సీన్ మజీద్, నవీన్ కుమార్‌లను సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నది. సోమ వారం మధ్యాహ్నం 3.30 గంటలకు కన్నూర్ నుంచి బయలు దేరిన ఇండిగో విమానంలో ఈ ప్రయత్నం జరిగింది. ఎల్డీఎఫ్ కన్వీనర్ ఈపీ జయరాజన్.. కాంగ్రెస్ నాయకుల దారుణ చర్యను ప్రతిఘటించారు.ఈపీ జయరాజన్, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్ల టీషర్టులను ధరించిన ఆ ఇద్దరు సీఎం వెళ్తున్న విమానంలోకి ఎక్కారు. విమానంలో నానా హంగామా చేశారు. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం విమానం తిరువనంతపురంలో ల్యాండ్ కాగానే అక్కడా సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు వినిపించి రభస సృష్టించారు. అనంతరం సీఎం తన అధికార నివాసం క్లిఫ్ హౌజ్‌కు చేరుకున్నారు. పోలీసులు ఆయనకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
ఈ ఘటనపై సీపీఐ(ఎం) స్టేట్ సెక్రెటరీ కొడియేరి బాలకృష్ణన్ స్పందించారు. సీఎంను ప్రజలే రక్షించుకుంటారని తెలిపారు. ప్రజల మద్దతు ఉన్నంత వరకూ విజయన్ సీఎంగా ఉంటారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా కొందరు అలర్లకు కుట్ర పన్నుతున్నారని తెలిపారు.
సీఎంను దాడి చేయడానికి వారు ప్రయత్నించారని ఈపీ జయరాజన్ ఆరోపించారు. విమానంలో జరిగిన దానిని ఆయన ఉగ్రచర్యగా అభివర్ణించారు. యూత్ కాంగ్రెస్ నాయకులు మద్యం సేవించి ఉన్నారనీ, విమానంలో రభసకు ప్రయత్నించారని ఆయన చెప్పారు. ఏయిర్పోర్టు అధికారులు వారిపై చర్య తీసుకోవాలన్నారు.