Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళ సీఎం విజయన్ స్పష్టీకరణ
కన్నూర్ : రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ వారికిష్టమైన దుస్తులు, వారికిష్టమైన రంగులు ధరించే హక్కు వుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టం చేశారు. కొన్ని స్వార్థపర శక్తులు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అంటూ అటువంటి శక్తులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బంగారం అక్రమ రవాణా కేసులో కీలక నిందితురాలు స్వప్న సురేష్ ఆరోపణల ఆధారంగా కాంగ్రెస్, బీజేపీలు వరుసగా నిరసనలు కొనసాగిస్తున్న తరుణంలో నల్ల మాస్కులు, నల్ల దుస్తులు ధరించడాన్ని రాష్ట్రప్రభుత్వం నిషేధించిందని ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై విజయన్ స్పందిస్తూ, ఈ దిశగా ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని స్పష్టం చేశారు. సోమవారం కన్నూర్‌లో కేరళ రాష్ట్ర లైబ్రరీ కౌన్సిల్ సమావేశాన్ని ఆన్లైన్లో ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి మాట్లాడారు. వివిధ పోరాటాల ద్వారా ఒక వర్గం ప్రజలు తమ ఛాతీని దాచుకునే హక్కును, నడిచే హక్కును గెలుచుకున్నారని గుర్తు చేశారు. అటువంటి పోరాటాల చరిత్ర వున్న రాష్ట్రంలో, నల్ల మాస్కులు, దుస్తులు ధరించే హక్కును, స్వేచ్ఛగా నడిచే హక్కును నిషేధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కొందరు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఒక వర్గం ప్రజలు స్వేచ్ఛగా నడిచేందుకు వీల్లేని పరిస్థితి రాష్ట్రంలో చోటు చేసుకోదని ఆయన హామీ ఇచ్చారు. పాత ఆలోచనలతోనే వున్న కొంతమంది ఇలాంటివి జరుగుతాయని భావిస్తూ వుండొచ్చు కానీ కేరళ వంటి రాష్ట్రంలో అటువంటివి ఎన్నడూ అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఇటువంటి తప్పుడు కథనాలు వ్యాప్తి చేసేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర విశిష్టతను పరిరక్షించుకునేందుకు వామపక్ష ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.