Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీయేతర పార్టీలను లీడ్ చేసే సత్తా కేసీఆర్‌కు ఉంది: మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్
రాజమహేంద్రవరం : బీజేపీయేతర పార్టీలను లీడ్ చేసే సత్తా తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ప్రశంసలు కురిపించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి కలిశానని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయనతో మాట్లాడానని అన్నారు. పార్టీ ఏర్పాటు గురించి ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. బీజేపీ గురించి పలు అంశాలపై చర్చించామని తెలిపారు. ఆ పార్టీపై ఇద్దరికీ ఒకే రకమైన అభిప్రాయాలు ఉన్నాయన్నారు. ఎపీలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీకే మద్దతు ఇస్తాయని పేర్కొన్నారు. ఏపీలో ఆ పార్టీలకు బీజేపీని వ్యతిరేకించే పరిస్థితి లేదని తెలిపారు. బీజేపీపై తనకున్న అవగాహనను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారన్నారు. పక్కా ఎజెండాతో కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని వెల్లడించారు. కేసీఆర్ జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెట్టబోతున్నారని.. ఆ పార్టీ ఏపీ వ్యవహారాలను తనకు అప్పజెప్పబోతున్నారని వస్తున్న వార్తలను ఉండవల్లి కొట్టిపారేశారు. ప్రస్తుతం తాను రాజకీయాల నుంచి రిటైర్డ్ అయ్యానని తెలిపారు. బీజేపీ విధానాలు దేశానికి ప్రమాదకరమని, దేశంలో ప్రత్యామ్నాయం అవసరమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో తనతో పాటు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్ కూడా ఉన్నారని తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి వైసీపీ మద్దతు చాలా కీలకమని, ఈ పరిస్థితుల్లో రాష్ట్ర సమస్యలను పరిష్కరించుకునే వీలుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.