Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ నెల 20 నుంచి 25 వరకు ఆందోళనలు
- ఎస్ఎఫ్ఐ పిలుపు
న్యూఢిల్లీ : చరిత్రను బుల్డోజింగ్ చేయటం ఆపాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. చరిత్రపై దాడిని నిరసిస్తూ జూన్ 20 నుంచి 25 వరకు ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విపి సాను, మయూక్ బిస్వాస్ సోమవారం ఒక ప్రకటన విడుదలచేశారు. బీజేపీ హిందూత్వ ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా విద్యావ్యవస్థను నిర్వీర్యం చేయడంతోపాటు.. పాఠశాలలు, విశ్వవిద్యాలయాల సిలబస్‌లను మార్చడం, వక్రీకరించడం, అబద్దాలతో నింపడం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. చరిత్రపై ప్రణాళికాబద్ధంగా దాడి చేస్తున్నదని విమర్శించారు. చరిత్ర ముసుగులో పురాణాలను ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేయడం నుంచి దేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రను మార్చడం వరకూ, చరిత్రను వక్రీకరించడానికి చురుకుగా ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
'చరిత్రను కొత్తగా రాయడం'పై హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన ఈ భావాన్ని ప్రతిబింబించడమే కాకుండా, ఈ ప్రక్రియలో ప్రభుత్వ పాత్ర గురించి బహిరంగంగా ఒప్పుకున్నట్టు కనిపిస్తున్నదని విమర్శించారు. విద్యా సంస్థలతో పాటు, హిందూత్వ శక్తులు కూడా సినిమాలు, ఇతర ప్రముఖ మీడియా సంస్థల ద్వారా చరిత్రను వక్రీకరించే పనిలో చురుకుగా నిమగమై ఉన్నాయని తెలిపారు. అబద్దాలపై నిర్మించిన భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారని అన్నారు. ప్రజల చరిత్ర, ప్రజలను వారి చరిత్ర నుంచి వేరు చేయడానికి ప్రయత్నిస్తే ప్రతిఘటనను ఎదుర్కోకతప్పదని హెచ్చరించారు. చరిత్రను అబద్ధాలతో నింపడానికి ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ఈ ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఈ నెల 20 నుంచి 25 వరకు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ ప్రకటించి జూన్ 25 నాటికి 47 సంవత్సరాలు పూర్తవుతాయనీ, ఈ ఆందోళనలు అప్పటి, ఇప్పుటి మధ్య ఉన్న సమాంతరాలను గుర్తుంచుకుంటాయని అన్నారు. దేశం ఎదుర్కొంటున్న అప్రకటిత ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రతిఘటనను బలోపేతం చేస్తామన్నారు.