Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 6 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరి
- సెన్సెక్స్ 1457 పాయింట్ల పతనం
ముంబయి : దేశంలో హెచ్చు ద్రవ్యోల్బణానికి తోడు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు భారత మార్కెట్లను బెంబేలెత్తించాయి. అన్ని రంగాల ఈక్విటీలు భారీ అమ్మకాల ఒత్తిడికి గురి కావడంతో దలాల్ స్ట్రీట్ కన్నీరు పెడుతోంది. సోమవారం సెషన్లో ప్రారంభం నుంచి తుది వరకు అమ్మకాల పరంపర కొనసాగింది. ఏ క్షణంలోనూ ఆశలు కానరాలేదు. తుదకు బీఎస్ఈ సెన్సెక్స్ 1,456.74 పాయింట్లు లేదా 2.68 శాతం పతనమై 52,846.70కు పడిపోయింది. ఒక్క పూటలోనే మదుపర్ల సంపద రూ.6.48 లక్షల కోట్లు ఆవిరైంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 452 పాయింట్లు నష్టపోయి 15,749 వద్ద ముగిసింది. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 3.15 శాతం, 2.73 శాతం చొప్పున క్షీణించాయి. బీఎస్ఈలో అన్ని రంగాలు నేల చూపులు చూశాయి. ఐటీ రంగం అత్యధికంగా 3.92 శాతం క్షీణించింది. లోహ సూచీ 3.39 శాతం, పరిశ్రమలు 3.35 శాతం, ఫినాన్స్ 3.17 శాతం, బ్యాంకింగ్ 3.12 శాతం చొప్పున కుప్పకూలాయి. 2,839 స్టాక్స్ నష్టాలు చవి చూడగా.. 658 సూచీలు లాభపడగా.. మరో 116 సూచీలు యథాతథంగా నమోదయ్యాయి. శుక్రవారం సెషన్లోనూ సెన్సెక్స్ 1000 పాయింట్ల పైగా పతనమయ్యింది. దీంతో రెండు సెషన్లలో మదుపర్లు ఏకంగా రూ.9.75 లక్షల కోట్లు నష్టపోయారు. బీఎస్ఈ మార్కెట్ కాపిటలైజేషన్ రూ.2,45,19,673 కోట్లకు పరిమితమైంది.
ప్రధాన కారణాలు..
దేశంలో అధిక ధరలు మదుపర్ల విశ్వాసాన్ని ప్రధానంగా దెబ్బతీశాయి. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచనుందన్న సంకేతాలు, విదేశీ సంస్థాగత మదుపర్లు ఈక్విటీలను తరలించుకుపోవడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ చరిత్రలోనే కనిష్ట స్థాయికి పడిపోవడం, చమురు ధరల పెరుగుదల మార్కెట్లను దిగాలు పడేలా చేశాయి. ప్రపంచ మార్కెట్లు ప్రతికూలతలో ట్రేడింగ్ కావడం భారత ఈక్విటీలపై ప్రభావం చూశాయి. శుక్రవారం సెషన్లో రూ.3,973 కోట్ల ఎఫ్ఐఐలు తరలిపోయాయి. జూన్ నెలలో ఇప్పటివరకు రూ.13,888 కోట్లు ఉపసంహరించుకున్నారు. ఈ ఏడాదిలో మొత్తంగా రూ.1.18 లక్షల కోట్ల ఎఫ్ఐఐ నిధులు తరలిపోయాయి. రాబోయే కాలంలో కూడా ఈ నిధుల ఉపసంహరణ కొనసాగే ఆస్కారం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సమీప భవిష్యత్తులో మార్కెట్లలో అస్థిరత చోటు చేసుకునే ప్రమాదం లేకపోలేదని నిపుణులు హెచ్చరించడం మదుపర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి.